కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

27 Aug, 2015 04:17 IST|Sakshi
కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మం డలం పంచగామ గ్రామంలోని తన వ్యవసాయక్షేత్రంలో పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం కె.చంద్రశేఖరరావు, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఉప నేత భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జె.గీతారెడ్డి, ఫరీదుద్దీన్, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

నారాయణఖేడ్‌లోని కిష్టారెడ్డి నివాసం నుంచి ఆయన భౌతికకాయాన్ని ఉదయం ప్రత్యేక వాహనంపై ఉంచి పంచగామలోని వ్యవసాయ క్షేత్రం వరకు మూడు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా తరలిం చారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. కిష్టారెడ్డి భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కిష్టారెడ్డితో కలసి 1989-94లో సిద్దిపేట శాసనభ్యుడిగా పనిచేసిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు.

కిష్టారెడ్డి భౌతికకాయానికి ఆయన పెద్ద కుమారుడు సంజీవరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ బి.సుమతి, పోలీసు సిబ్బంది.. భౌతికకాయానికి గౌరవ వందనం చేయగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా, అంతకుముందు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు చేరుకున్న కిష్టారెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఖేడ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు.

మరిన్ని వార్తలు