అంతా నకిలీమయం.. | Sakshi
Sakshi News home page

అంతా నకిలీమయం..

Published Thu, Aug 27 2015 4:14 AM

అంతా నకిలీమయం.. - Sakshi

- నిమిషాల్లో ఆధార్, ఓటర్ ఐడీ కార్డుల తయారీ
- నగరంలో యథేచ్ఛగా దందా
ప్రగతినగర్ :
బోగస్ పత్రాలతో కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను దర్జాగా స్వాహా చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, టెన్‌‌త, ఇంటర్ తదితర సరిఫికెట్లను నిమిషాల్లో తయారు చేసి లక్షలు గడిస్తున్నారు. బోర్గాం, దుబ్బ మీ సేవ కేంద్రాల్లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన సంఘటన వెలుగు చూసింది. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఓ సెంటర్ నిర్వాహకుడు వీరందరికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.

వెయ్యి రూపాయల పింఛన్ వీరికి కాసుల వర్షం కురిపించింది. పేరు మార్పిడి, చిరునామా, వయసు మార్చి అనర్హులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఉదాహరణకు ఓటరు నమోదు కార్డు కావాలంటే ముందుగా వీ సేవ సెంటర్‌లో టెన్‌‌త మెమో లేదా 18 సంవత్సరాలు నిండిన వయస్సు ధ్రువీకరణ పత్రంతో పది రూపాయలు చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అధికారులు విచారణ చేసి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఈ కార్డు కావాలంటే సుమారు రూ.వెయ్యి, ఒక పాస్‌పోర్టు ఫొటో ఇస్తే చాలు.. వారి దగ్గర ఉన్నా డాటా ఫార్మాట్‌లో పేరు నమోదు చేసుకుని హోలోగ్రాం, ఎలక్ట్రోరల్ అధికారి సంతకాలు చేసి గంటలో ఓటరు కార్డును తయారు చేసి ఇస్తున్నట్లు తెలిసింది.
 
ఓటరు కార్డు ఆధారంగా కులం, ఆదాయం, నివాసం, లోకల్, సదరం తదితర సర్టిఫికెట్లను పొందుతున్నారు. ఈ సర్టిఫికెట్లను చూపి సదరు బోగస్‌దారులు పాస్‌పోర్టుకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కూడా ఈ నకిలీ ఓటరు గుర్తింపు కార్డును ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. గత జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ 24వ డివిజన్‌లో ఒకేసారి 16 బోగస్ ఆధార్‌కార్డులను గుర్తించారు. దీంతో నకిలీ కార్డుల దందా అరికట్టేందుకు అధికారులు స్పెషల్ టాస్క్‌ఫోర్‌‌సను ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్‌‌స తనిఖీలు చేసి బోర్గాంలోని మీ సేవ సెంటర్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
 
అదేవిధంగా దుబ్బ, వర్ని రోడ్డులోని మీ సేవ కేంద్రాలను సీజ్ చేశారు. ఇంతలో గోదావరి పుష్కరాలు రావడం, కలెక్టర్ బదిలీ కావడంతో తనిఖీలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీకార్డులు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement