రెండోసారి మున్సిపాలిటీగా నర్సాపూర్‌

2 Aug, 2018 10:30 IST|Sakshi
గతంలోనే పురపాలక సంఘంగా ఉన్నట్లుగా నీటి బావికి ఉన్న శిలాఫలకం 

నర్సాపూర్‌: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌ను రాష్ట్ర ప్రభుత్వ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు 2నుంచి మున్సిపాలిటీగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు ఒకటి నాటికి ప్రస్తుతం ఉన్న గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనున్నందున 2నుంచి కొత్త పురపాలక సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం కొనసాగిన భవనంలోనే పురపాలక సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సంబంధిత అధికారులు ఆ భవనానికి ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం బోర్డును తొలగించి పురపాలక సంఘం బోర్డును ఏర్పాటు చేశారు. 

నేటి నుంచి అమలులోకి..

నర్సాపూర్‌ పట్టణం గతంలో ఒకసారి పురపాలక సంఘంగా కొనసాగింది. 1960  నుంచి కొన్నేళ్ల పాటు పట్టణం పురపాలక సంఘం హోదాలో కొనసాగింది. అనంతరం సరిపడా జనాభా లేనందున పురపాలక సంఘం నుంచి తగ్గించి మేజర్‌ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మేజర్‌ గ్రామ పంచాయతీలను కొత్తగా పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టగా నర్సాపూర్‌కు పురపాలక సంఘం హోదా దక్కింది.

పట్టణంలో  2011 లెక్కల ప్రకారం జనాభా 18,338 మంది ఉండగా వారిలో 9,627 మంది పురుషులు, 8,711 మంది మహిళలు ఉన్నారు. పట్టణంలో 9,607 మంది ఓటర్లు ఉండగా 4,854 పురుషులు, 4,753మంది మహిళా ఓటర్లు ఉన్నారు.  తాజాగా పరిశీలిస్తే జనాభా, ఓటర్లు ఎక్కువగా ఉంటారు. నర్సాపూర్‌ను గురువారం పురపాలక సంఘంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు