చిన్న చేపలపై క్రిమినల్ దెబ్బ

13 Feb, 2015 03:11 IST|Sakshi
చిన్న చేపలపై క్రిమినల్ దెబ్బ

మిర్యాలగూడ క్లస్టర్ సిబ్బందిపై ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసులు
మరి ప్రాజెక్టు డెరైక్టరు... డబ్బులు బొక్కిన ఫర్మ్‌ల సంగతేంటో?
హడావుడిగా క్షేత్రస్థాయి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు
పెద్దలపై చర్యలు తీసుకుంటారనే చర్చ
నేడు కోదాడ క్లస్టర్ సిబ్బందిపై కేసుల నమోదు?

 
నల్లగొండ : ఇందిర జలప్రభ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ క్లస్టర్‌లో ప్రభుత్వ ధన దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 32 మంది సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన 32 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ కె. దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని ఆరుపోలీసు స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. త్రిపురారం, నిడమనూరు, మిర్యాలగూడ, దామరచర్ల, నేరేడుచర్ల, గరిడేపల్లి పీఎస్‌లో ఐపీసీ  409, 418, 420 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు.

వీరిలో అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ మల్లయ్యతో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జియాలజిస్టులు ఉన్నారు. ఈ కేసులన్నింటిలోనూ ఏపీడీ మల్లయ్యను మొదటి నిందితుడు (ఏ1)గా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే, చట్టపరమైన చర్యలు చేపట్టడంలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరిపై కేసులు నమోదు చేశామని చెపుతున్న అధికారులు... అసలు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన ఫర్మ్‌ల నిర్వాహకులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది చర్చనీయాంశంగా మారుతోంది. తమ శాఖ పరిధిలో రిజిస్టర్ చేసుకుని, తమ శాఖ డబ్బులను అడ్డంగా దిగమింగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదనేది అటు డ్వామా సిబ్బందితో పాటు జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది.

మరి వారిని ఏమీ అనరా సారూ...!

అయితే, ఈ కుంభకోణం విషయంలో ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ... పెద్ద తలకాయలను వదిలి చిన్న చేపలపై ఇంత త్వరగా క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నదే ప్రశ్నగా మిగులుతోంది. వాస్తవానికి ఈ కుంభకోణంలో అప్పటి ప్రాజెక్టు డెరైక్టర్ సునందతో పాటు దాదాపు 22 మంది ప్రైవేటు వ్యక్తులు ఫర్మ్‌ల పేరిట ఈ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి.

ప్రాథమిక విచారణలో కూడా ఈ అంశం తేలింది. అయితే, సునంద స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవడం తమ చేతిలో లేదని, ఏం చేయాలన్న దానిపై శాఖా పరమైన విచారణ జరుగుతోందని అధికారులు చెపుతున్నారు. నిధులను డ్రా చేయడంలో ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఆమె బాధ్యత ఏ మేరకు ఉందో తెలుసుకోవాల్సి ఉంటుందని వారంటున్నారు. అదే విధంగా ఫర్మ్‌ల పేరిట వచ్చిన ప్రైవేటు వ్యక్తులపై కూడా కనీస చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదన్నది మరో ప్రశ్న.

వీరిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, మరో 3,4 రోజుల్లో 22 ఫర్మ్‌లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెపుతున్నారు. మరి ఈ నాలుగు రోజులకే ఆగకుండా 32 మంది సిబ్బందిపై కేసులు ఎందుకు నమోదు చేయాలని, అందరిపై కేసులు ఒకేసారి పెట్టి చర్యలు తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ కేసులో ఉన్న సిబ్బందికి ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఫోన్ సర్వీసులను కూడా గురువారం మధ్యాహ్నం నుంచి అధికారులు కట్ చేసినట్టు తెలుస్తోంది.

సీసీఎస్ విచారణ లేదంట!

ఈ కేసును విచారించే అంశాన్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులకు అప్పగించే విషయాన్ని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. సీసీఎస్ విచారణ జరిపే అంశంపై సీనియర్ కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకోగా, సీసీఎస్ విచారణ కన్నా ఎక్కడికక్కడ స్థానిక స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారని అధికారులు చెపుతున్నారు. అయితే, ఈ కుంభకోణంలో డ్వామా సిబ్బంది దుర్వినియోగం చేసిన దాని కన్నా ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉందన్న ఆరోపణలున్న నేపథ్యంలో సీబీసీఐడీకి ఈ కేసు విచారణ అప్పగించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. కానీ, కనీసం సీసీఎస్‌కు కూడా అప్పగించకుండా స్థానిక పోలీసులకు ఈ కేసు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కోదాడ క్లస్టర్‌లో మరో 43 మందిపై

మిర్యాలగూడ క్లస్టర్‌తో పాటు కోదాడ క్లస్టర్ పరిధిలో కూడా ఇందిర జలప్రభ నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రాథమిక విచారణలో తేలింది. క్లస్టర్ వ్యాప్తంగా రూ.22లక్షల మేర కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై 43 మందిని సస్పెండ్ చే స్తూ డ్వామా పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు క్లస్టర్ పరిధిలోని అన్ని ఎంపీడీఓల కార్యాలయాలకు వెళ్లాయి. ఈ సస్పెన్షన్‌కు గురైన వారిపై శుక్రవారం క్రిమినల్ కేసులు నమోదు కానున్నాయి. వీరిలో కూడా ఏపీడీలు వెంకటేశ్వర్లు, రమేశ్‌తో పాటు 41 మంది క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు.

ఎలాంటి రాజకీయ జోక్యం లేదు- దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ

క్రిమినల్ కేసుల నమోదు విషయంలో ఎవరి జోక్యం లేదని, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చేస్తున్న సూచనలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం.  ఇందిర జలప్రభ నిధుల దుర్వినియోగం విషయంలో నిబంధనలకు అనుగుణంగా ముందుకెళుతున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు.

మరిన్ని వార్తలు