గెలుపే లక్ష్యం | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యం

Published Fri, Feb 13 2015 3:37 AM

గెలుపే లక్ష్యం - Sakshi

మంత్రి జగదీష్‌రెడ్డి దిశానిర్దేశం
జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులతో సమావేశం
ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్‌తో పాటు అందరూ హాజరు
నక్కలగండిని కాంగ్రెస్ నేతలు వద్దన్నారనివ్యాఖ్య

 
నల్లగొండ రూరల్ : త్వరలోనే జరగబోయే రెండు శాసన మండలి స్థానాలను గెలుచుకోవడం ద్వారా జిల్లాపై పట్టు నిరూపించుకోవాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ తహత హలాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రులతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కూడా కైవసం చేసుకోవాల్సిందేనని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు పనిచేయాలని, రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకోవడం ద్వారా జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే ఉందని నిరూపించాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ నేత లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు స్థానిక ఏచూరి గార్డెన్‌లో  జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్‌లు సహా సుమారు 450 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  డబ్బుతో ప్రజాప్రతినిధులను, ఓటర్లను కొనుగోలు చేస్తామన్న నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఓటర్లను డబ్బుతో కొంటామనే అహంకారంతో మాట్లాడే నాయకులకు భువనగిరి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఇదే ఫలితాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాలని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినుద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. సీఎంతోను, మంత్రులతో సంబంధాలున్నాయని తప్పుడు ప్రచారం చేసే నాయకులను తిప్పికొట్టాలని కోరారు.

కొందరు కాంగ్రెస్ నాయకులు నక్కలగండిని వద్దని తనకు చెప్పారన్నారు. పట్టుదలతో కలిసి పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగిద్దామన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ సమష్టిగా పనిచేసి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజదుందుభి మోగించాలన్నారు.

జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్సీలను గెలుపించుకోవాలన్నారు.  ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతు భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు బహుమానంగా ఇవ్వాలన్నారు. పార్లమెంటరి కార్యదర్శి గాదరి కిషోర్ మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలన్నారు.  ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా గౌరవం దక్కాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు జిల్లా అభివృద్ధి కోసం ఏనాడూ పనిచేయలేదన్నారు.

ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు డబ్బు అహంకారానికి, అభివృద్ధికి జరుగుతున్న పోటీగా భావించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, పార్టీ నేతలు కాసోజు  నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, శశిధర్‌రెడ్డి, శంకరమ్మ, చాడా కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, బోయపల్లి కృష్ణారెడ్డి, పవళిక, బక్క పిచ్చయ్య, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement