రాష్ట్రంలో 68 కొత్త పుర పీఠాలు!

2 Aug, 2018 02:09 IST|Sakshi

173 గ్రామ పంచాయతీలు, గ్రామాల విలీనంతో ఏర్పాటు

41 పురపాలికల్లో మరో 136 గ్రామ పంచాయతీల విలీనం

బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన పురపాలక హోదా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 68 పురపాలక సంఘాలు ఆవిర్భవించాయి. 173 గ్రామ పంచాయతీలు/ గ్రామాల విలీనంతో ఈ పురపాలికలు ఏర్పాటయ్యాయి. దీనికితోడు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 5 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలు/గ్రామాల్లోని భాగాలూ విలీనమయ్యాయి. ఈ గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీకాలం బుధవారంతో ముగిసిపోవడంతో గురువారం నుంచి వీటికి పురపాలికల హోదా అమల్లోకి వచ్చింది.

రాష్ట్రంలో కొత్త మునిసిపాలిటీల ఏర్పాటు, మునిసిపాలిటీల్లో శివారు ప్రాం తాల విలీనంకోసం మార్చిలో ప్రభుత్వం శాసనసభ లో రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం, మున్సిపల్‌ కార్పొ రేషన్ల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టాలకు సవరణలు జరిపిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీతోసహా రాష్ట్రంలో 74 పురపాలికలుండగా, తాజాగా మరో 68 పురపాలికల ఏర్పాటుతో పురపాలికల సంఖ్య 142కు పెరిగింది.

2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా కోటి 24 లక్షల 90 వేల 739 కాగా, కొత్త పురపాలికల ఏర్పాటుతో ఈ సంఖ్య కోటి 45లక్షలకు పెరిగిందని పురపాలక శాఖ తెలిపింది. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 నుంచి 44 శాతానికి ఎగబాకింది. కొత్తగా పట్టణ ప్రాంత హోదా పొందిన 209 గ్రామపంచాయతీలు/గ్రామాల పరిధి లో గురువారం నుంచి ఉపాధి హామీ పథకం అమలు ను నిలిపివేయనున్నారు. దీంతో 5 లక్షల నుంచి 8 లక్షల మంది కూలీలు జీవనోపాధిని కోల్పోనున్నా రు. కొత్త మునిసిపాలిటీల్లో మూడేళ్లపాటు ఆస్తి పన్ను లు పెంచబోమని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.  

ప్రత్యేకాధికారుల పాలన షురూ!
కొత్తగా ఏర్పడిన పురపాలికలకు ఎన్నికలు జరిగే వరకు పాలన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పురపాలక శాఖ ప్రత్యేకాధికారులతో పాటు ఇన్‌చార్జి మునిసిపల్‌ కమిషనర్లను నియమించింది. ప్రత్యేకాధికారులుగా ఆర్డీఓలు, ఇన్‌చార్జి మునిసిపల్‌ కమిషనర్లుగా తహశీల్దార్లను నియమిస్తూ ఆ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు చేసిన అధికారులను ప్రత్యేకాధికారులు, ఇన్‌చార్జి మునిసిపల్‌ కమిషనర్లుగా నియమించింది. మునిసిపాలిటీల చట్టాలకు సవరణలు జరపడం ద్వారా ప్రభుత్వం ఏకపక్షంగా తమ గ్రామా లను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసిందని ఆరోపిస్తూ పలు గ్రామాల ప్రజలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు ఇంకా విచారణకు రాలేదని పురపాలక శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు