దీపావళికి కొత్త కలెక్టరేట్లు

4 Sep, 2018 02:21 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్‌

  జగిత్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మేడ్చల్‌ భవనాల ప్రారంభం  

  ‘ముందస్తు’ నేపథ్యంలో నిర్మాణాల దూకుడు 

  చాలాచోట్ల పూర్తికాని పనులు 

  కరీంనగర్, వరంగల్‌ కలెక్టరేట్లకు ఇంకా మొదలు కాని పనులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుకు కసరత్తులు ముమ్మరం చేస్తున్న దరిమిలా తన పథకాల్లో దూకుడు పెంచింది. ఎన్నికల కోసం వెళ్లేలోగా ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నీ పూర్తిచేసి చూపించే వెళ్లాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, కీలక పథకాలు వేగిరపరచాలని సీఎం పేషీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో కొత్త జిల్లాల కలెక్టరేట్‌ భవనాలు కూడా ఉన్నాయి. 2016లో దసరాకు కొత్త జిల్లాల ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌ ఉమ్మడి 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే. వీటిలో మొత్తం 27 కలెక్టరేట్లకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ బాధ్యతలను ఆర్‌ అండ్‌ బీ చూస్తోంది. సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా కదులుతున్నారు. 

దీపావళికి ప్రారంభమయ్యేవి ఇవే.. 
వాస్తవానికి 2017లోనే ఈ భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. వీటిలో జగిత్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మేడ్చల్‌ కలెక్టరేట్ల నిర్మాణాలు కొలిక్కి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళికి ఈ నాలుగు భవనాలను ప్రారంభించి, మిగిలినవి ఎన్నికల నాటికి ప్రారంభించాలని సీఎం పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఆర్‌ అండ్‌బీ పనులు పూర్తి చేసేందుకు సమాయత్తమైంది.  

కాగా వికారాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం, వనపర్తి జిల్లాల భవనాల నిర్మాణాలు వేగంగానే సాగుతున్నాయి. వాటిని డిసెంబరులో లేదా మార్చిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ ఏడు జిల్లాల కొత్త భవనాలు ఎన్నికలకు ముందే అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. 

మందకొడిగా నడుస్తున్నవి ఇవే..! 
మరోవైపు మిగిలిన కలెక్టరేట్‌ భవనాలు ఇంకా నత్తనడకన సాగుతుండటం అధికారులను కలవరపెడుతోంది. వాస్తవానికి ఇవన్నీ బహుళ అంతస్తులు. వీటిని ఏడాదిలోపు పూర్తి చేయాల్సి రావడం కష్టమే. పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్, సూర్యాపేట, మెదక్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, నిర్మల్, గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మం మొత్తం 14 జిల్లాల భవనాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. వీటికి స్థలసేకరణ, టెండర్ల ఖరారు ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయి. దీంతో ఈ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 

పనులే మొదలు కానివి.. 
సాంకేతిక కారణాలతో వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ భవన నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. కరీంనగర్‌ కలెక్టరేట్‌కు ఇంకా స్థలం కేటాయింపు ఖరారు కావాలి. దీంతో ఈ రెండు జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు చాలా వెనకబడి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు