శివారుల్లో కొత్త కాలనీలు, లేఅవుట్లు

28 Dec, 2017 02:46 IST|Sakshi

అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ సమాయత్తం

భూసమీకరణ కోసం నోటిఫికేషన్‌ జారీ

నెల రోజుల్లోగా భూపత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలి

50 ఎకరాలపైన ఉంటేనే ముందుకు రావాలని కమిషనర్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారుల్లో అభివృద్ధితో కూడిన కాలనీలు, లేఅవుట్లు చేసేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సమాయత్తమైంది. దీనిలో భాగంగా భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) కోసం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లో 50 ఎకరాలకు తగ్గకుండా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతులు నెల రోజుల్లోగా తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం లోని భూసమీకరణ విభాగంలో సంప్రదించి.. తమ భూమి వివరాలతో కూడిన దరఖాస్తును అందించా లని పేర్కొన్నారు.

‘భూ యాజమాన్యపు హక్కు పట్టా ఉండాలి. కోర్టు కేసుల్లో ఉన్న భూములు తీసుకోరు. పట్టణాభివృద్ధి విభాగం తేదీ 1996 మార్చి 8 ప్రకారం ప్రతిపాదిత భూమి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం బఫర్‌జోన్, చెరువు, ఫుల్‌ ట్యాంక్‌ లెవల్, ఓపెన్‌ స్పేస్, జీవో ఎం ఎస్‌ నం.111లో ఉండకూడదు. మెట్రోపాలిటన్‌ అభివృద్ధి ప్రణాళిక–2031 నియమనిబంధనల ప్రకారం శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’అని స్పష్టం చేశారు.

సగం ప్లాట్లు రైతులకు..: భూ సమీకరణకు అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన 6 నెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లలో సగం సంబంధిత యజమానికి అప్పగిస్తారు. మిగతా సగం ప్లాట్లను హెచ్‌ఎండీఏ తన వద్దే ఉంచుకుంటుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

మిగతా భూములను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన 6 నెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతి నెలా భూమి మూల విలు వ(బేసిక్‌ వాల్యూ)పై 0.5% పరిహారాన్ని చెల్లిస్తారు.

మరిన్ని వార్తలు