శత్రువుల డ్రోన్లను హ్యాక్‌ చేస్తాయి

6 Mar, 2020 03:28 IST|Sakshi
డ్రోన్‌తో పాటు వసు గుప్త, రిషభ్‌ వశిష్ట

సరికొత్త డ్రోన్లను డిజైన్‌ చేసిన ‘ఐఐటీ మద్రాస్‌’

వ్యక్తులు, వాహనాలను గుర్తించేందుకూ వాడొచ్చు

పోలీసులు, మిలిటరీ వర్గాలకు ఎంతో ఉపయుక్తం

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లిళ్లు మొదలుకొని వ్యవసాయం వరకు.. డ్రోన్లను వాడని రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే.. ఉగ్రవాదులెవరైనా ఈ డ్రోన్లను వాడితే? దేశ రక్షణకు కీలకమైన స్థావరాలపై దాడులకు పాల్పడితే? ఏం ఫర్వాలేదంటున్నారు ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు. ఇలాంటి శత్రు డ్రోన్లను గుర్తించేందుకు వీరు ఓ కొత్త రకం డ్రోన్లను డిజైన్‌ చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తూ, శత్రువుల డ్రోన్లను హ్యాక్‌ చేసి, వాటి దిశ మార్చి సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేలా చేస్తాయని ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రోన్లను ఇంటర్నెట్‌ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రిం చొచ్చు. ఇవి పోలీసులు, మిలిటరీ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంటున్నారు.

ఇవి ఎంతో భిన్నం.. 
ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల పని తీరుకు ఇవి పూర్తి భిన్నంగా పనిచేస్తాయి. ఇంటర్నెట్‌ ద్వారా డ్రోన్లను నియంత్రించే అవకాశం ఉండటం వల్ల ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లను ఏకకాలంలో ఉపయోగించొచ్చు. వాహనాలు, మానవులు, ఇతర వస్తువులను గుర్తించేందుకు ఒకేసారి బోలెడన్ని ఈ డ్రోన్లను వాడొచ్చన్నమాట.

చీకట్లోనూ పనిచేస్తుంది.. 
ఈ డ్రోన్లను ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి వసు గుప్తా, ఐఐటీ మద్రాస్‌లోని ఆర్‌ఏఎఫ్‌టీ ల్యాబ్‌కు చెందిన రిషభ్‌ వశిష్టలు కలసి రూపొందించారు. ‘ఇవి తమ చూపుతోనే నేరుగా వస్తువులను, వ్యక్తులను కచ్చితంగా గుర్తించగలవు. నమూనా డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాత అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకొస్తాం’అని ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రంజిత్‌ మోహన్‌ వివరించారు. అవసరాలకు తగ్గట్టుగా వీటితో పనిచేయించుకోవచ్చని, ఒకేసారి బోలెడన్ని వాహనాలను ట్రాక్‌ చేయడమూ సాధ్యమని తెలిపారు. డీప్‌ న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ సాయంతో పనిచేసే ఈ కొత్త డ్రోన్ల సాయంతో చీకటిలోనూ కదలికలను గుర్తించొచ్చనని, ఇందుకు పరారుణ కాంతి కిరణాలను వాడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

గాల్లోనే హ్యాక్‌ చేస్తాయి.. 
ఈ కొత్త డ్రోన్లు నకిలీ జీపీఎస్‌ సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా శత్రు డ్రోన్లను తప్పుదోవ పట్టిస్తాయని, నకిలీ జీపీఎస్‌ ప్యాకెట్లను విడుదల చేస్తూ వాటిని కావాల్సిన చోట సురక్షితంగా దింపేస్తాయని వసు గుప్తా, రిషభ్‌ వశిష్టలు తెలిపారు. శత్రువుల డ్రోన్ల కోసం ప్రత్యేకంగా జీపీఎస్‌ సంకేతాలను అభివృద్ధి చేసి వాటిని హ్యాక్‌ చేస్తాయన్నమాట. తాము ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత నకిలీ జీపీఎస్‌ సంకేతాలను అందుబాటులో ఉన్న అన్ని రకాల జీపీఎస్‌ రిసీవర్లతో పరిశీలించి చూశామని, నాలుగైదు సెకన్లలోనే శత్రువుల డ్రోన్లను తమ అధీనంలోకి తీసుకురావడం సాధ్యమైందని వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా