ఆయిల్‌పామ్‌ సాగుకు కేంద్రం అనుమతి

23 Feb, 2020 04:09 IST|Sakshi

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 45,250 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లేఖ పంపిందని వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగు అనుమతి కోసం రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రైతులు విస్తృతంగా ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలని కోరారు.

పంటమార్పిడి దిశగా రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2019–20 సంవత్సరానికి గాను 2,500 ఎకరాల్లో రాష్ట్ర ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రారంభించిందని, రవాణా ఖర్చులు ఇచ్చి పంటను ఆయిల్‌ ఫెడ్‌ సేకరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని 246 మండలాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమని కేంద్ర సర్వే తేల్చిందని, విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ఆయిల్‌పామ్‌ సాగు వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పంటల సాగుతో తెలంగాణ రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  దేశంలో అన్నిరకాల పంటల సాగుకు తెలంగాణ ప్రాంతం అనుకూలం అయినందున రాష్ట్ర వ్యవసాయ రంగానికి చేయూత నివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు