అంతిమయాత్రకు అష్టకష్టాలు

23 Dec, 2019 11:28 IST|Sakshi
కృష్ణానది నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యం

అమరచింత మండలం ఈర్లదిన్నెలో ఘటన  

పూడ్చేందుకు స్థలం లేక రోజంతా అవస్థలు  

కృష్ణానది బ్యాక్‌ వాటర్‌లో వెళ్లి ఏటిగట్టున దహన సంస్కారాలు  

వనపర్తి, అమరచింత(కొత్తకోట): గ్రామానికో శ్మశానవాటిక ఉండడం ప్రతి ఒక్కరం చూశాం. కానీ మండలంలోని ఈర్లదిన్నెకి ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామంలో ఏ ఒక్కరు చనిపోయిన అంతిమయాత్రతో పాటు దహన సంస్కారాలు చేయడానికి స్థలం కరువైంది. దీంతో చనిపోయిన వారికి అంతిమయాత్ర నిర్వహిద్దామనుకున్న వారికి అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. గ్రామానికి సమీపంలో జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో నీరు నిల్వ ఉండడంతో నది నీటిని దాటుకుంటూ ఒడ్డు కనిపించే స్థలంలో దహన సంస్కారాలు చేస్తున్నారు.

ఆదివారం గ్రామానికి చెందిన బౌరిశెట్టి కుమారస్వామి మృతిచెందడంతో కుటుంబసభ్యులు నీటిలో నడుచుకుంటూ వెళ్లి దహన సంస్కారాలు చేసిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈర్లదిన్నె జూరాల ప్రాజెక్టు ముంపునకు గురవడంతో 25 సంవత్సరాల క్రితం గ్రామస్తులకు పునరావాసం కల్పించారు. కానీ శ్మశాన వాటికకోసం స్థలాన్ని కేటాయించకపోవడంతో ఏటిగడ్డ మీదనే దహన సంస్కారాలను చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు