అంతా ఆన్‌లైన్

15 Nov, 2014 04:10 IST|Sakshi

 ఖమ్మం అర్బన్ : ఏదైనా వస్తువు కొనాలంటే అనేక షాపులు తిరగాల్సిన పనిలేదు. మోడల్స్ నచ్చకపోతే నిస్తేజంగా ఇంటిముఖం పట్టాల్సిన అవసరం లేదు. ఇక ఇంట్లోనే కూర్చు ని మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఏయే వస్తువు ఏయే మోడళ్లలో లభ్యమవుతున్నాయి.. ధర ఎంత.. నాణ్యతా ప్రమాణాలు ఏమిటి తదితర వివరాలు తెలుసుకుని ఒక్క క్లిక్ చేస్తే చాలు. మనకు కావాల్సిన వస్తువు ఇంటి ముందు వాలిపోతున్నాయి.  దీంతో ఆన్‌లైన్ షాపింగ్‌పై నెటిజన్ల మోజు రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ తదితర మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఖమ్మం నగరం, కొత్తగూడెం పట్టణానికి కూడా పాకింది.  

 ఆన్‌లైన్‌లో అంగడి
 మనం షాపుకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ముందుగా మనకు ఆ వస్తువు గురించి అన్ని వివరాలు తెలియాలి. వస్తువు మన్నిక, మోడల్, దానికి అంత ఖరీదు పెట్టొచ్చా... అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వస్తువు కొనుగోలు చేయడానికి ఇంటర్నెట్ ఎంతో సహాయపడుతోంది. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్లలోకి వెళ్లి పరిశీలిస్తే మనకు కావాల్సిన వస్తువు వివరాలన్నీ దర్శనమిస్తాయి. ఏ వస్తువుకు ఏయే ఆఫర్లు ఉన్నాయనే విషయాలూ తెలుసుకోచ్చు. ఆ తర్వాత ఆర్డర్ చేసి డోర్ డెలివరీ పద్ధతిన ఇంటికి తెప్పించుకోవచ్చు.

 నేరుగా షాపింగ్
 గతంలో ఫోన్ బిల్లులు, బస్ టికెట్లు తదితర విషయాల కోసమే ఎక్కువగా ఆన్‌లైన్ విధానాన్ని ఉపయోగించే వారు. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేసేందుకు మార్కెట్‌లోకి పలు కంపెనీలు దూసుకొచ్చాయి. అమెజాన్, స్నాప్‌డీల్ డాట్ కామ్, ఓఎల్‌ఎక్స్, ఫ్లిక్‌డాట్ కామ్ తదితర కంపెనీలు ఆన్‌లైన్‌లో వస్తువులను అమ్మకాలకు పెడుతున్నాయి. ప్రముఖ కంపెనీల నుంచి ఈ ఆన్‌లైన్ కంపెనీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నేరుగా వినియోగదారులకు అందించడంతో మార్కెట్ సాధారణ ధరకంటే తక్కువగా ఉండడంతో ఆన్‌లైన్‌పై మోజు క్రమేణా పెరుగుతోంది. వస్తువలు కొనడానికే కాకుండా విక్రయించేందుకు సైతం ‘ఓఎల్‌ఎక్స్’ వంటి ఆన్‌లైన్ కంపెనీలు ఉపయోగపడుతున్నాయి.

 ఇష్టమైన వారికి బహుమతులు
 ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా తమకు ఇష్టమైన వ్యక్తులకు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి  ఎవరికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నామో వారి పేరుపై గిఫ్ట్‌ను పంపించి సర్‌ప్రైజ్ చేయొచ్చు.  ‘స్నాప్ డీల్ డాట్ కామ్’ ద్వారా ఇలాంటి  అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు