రిమ్స్‌లో నర్సుల ఆందోళన  

5 Jun, 2018 14:13 IST|Sakshi

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కేందుకు యత్నం

సముదాయించిన డీఎస్పీ, రిమ్స్‌ డైరెక్టర్‌

ఆదిలాబాద్‌ : నర్సుల బదిలీలను 20 శాతానికి కుదించడాన్ని నిరసిస్తూ రిమ్స్‌ ఆస్పత్రి నర్సులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కేందుకు యత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.

మరికొందరు రిమ్స్‌భవనం ఎక్కి నిరసన తెలిపారు. ఆందోళన సమాచారం అందుకున్న ఆదిలాబాద్‌ డీఎస్పీ నర్సింహారెడ్డి, రిమ్స్‌ డైరెక్టర్‌ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వం రిమ్స్‌ సిబ్బందిపై వివక్ష చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎనిమిదేళ్ల నుంచి రిమ్స్‌లోనే పనిచేస్తున్నామని, కుటుంబాలకు దూరంగా గడుపుతున్నామన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లు 40 శాతం బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

బదిలీల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం నిర్ణయం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ సిబ్బంది పద్మ, వినోద, కరుణ, వేరోనిక, సరిత, తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు