సీఎం దాకా వద్దు.. మేం చేసి పెడతాం

19 Jul, 2019 07:52 IST|Sakshi
ఆవేదన వ్యక్తం చేస్తున్న సుందర్‌లాల్‌పాసి

సీఐ, తహసీల్దార్‌ హామీతో యాత్ర విరమించిన నిర్వాసితుడు

ఇల్లెందుఅర్బన్‌’(భద్రాద్రి కొత్తగూడెం): ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీలో తాము భూములు కోల్పోయామని, తమకు పరిహారం ఇప్పించి న్యాయం చేయా లని కోరుతూ గురువారం నిర్వాసితుడు సుందర్‌లాల్‌పాసి తన కుటుంబ సమేతంగా ఎండ్ల బండిపై యాత్ర ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకునేందుకు హైదరాబాద్‌ బయలుదేరాడు. యాత్ర కారేపల్లి మండలం ఆల్యా తండాకు చేరుకునే సరికి.. సమాచారం తెలుసుకున్న ఇల్లెందు సీఐ వేణుచందర్‌ వారిని ఆపి.., సమస్య తెలుసుకుని కారేపల్లి తహసీల్దార్‌ స్వామి వద్దకు తీసుకువెళ్లారు. తహసీల్దార్‌ ఇల్లెందు ఏరియా సింగరేణి ఎస్టేట్‌ ఆఫీసర్‌ సునీతను కారేపల్లికి పిలిపించి వారి సమక్షంలోనే చర్చించారు.

నిర్వాసితుడి వద్ద గల భూపత్రాలను పరిశీలించారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తహసీల్దార్‌ హామీవ్వడంతో నిర్వాసితుడు తమ యాత్రను విరమిం చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుడు సుందర్‌లాల్‌పాసి మాట్లాడుతూ ఓసీ ఏర్పాటులో భాగంగా యాజమాన్యం తమకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు వల్ల నేడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. భూములకు సంబంధించిన పత్రాలన్ని ఉన్నా అధికారులు పరిహారం ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. సుమారు 10 ఎకరాల భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు