రోడ్డెక్కిన పండుటాకులు

18 Jan, 2015 13:00 IST|Sakshi

పరిగి: తమకు పింఛన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వృద్ధులు, వితంతువులు రోడ్డెక్కారు. పరిగి పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై శనివారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాము అన్ని రకాలుగా అర్హులమైనప్పటికీ పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరమ్ సర్టిఫికెట్లు ఉన్నా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మూడు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్న అధికారులు పింఛన్ల విషయం మాత్రం తేల్చడం లేదన్నారు.
 
ఈ ఆందోళనతో రోడ్డుపై భారీ మొత్తంలో వాహనాలు స్తంభించాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ మండల అధ్యక్షుడు పెంటయ్యగుప్తా, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌లు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని ఎంపీడీఓ విజయప్ప హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.

మరిన్ని వార్తలు