కార్పొరేట్‌ కాలేజీల ‘విస్తరణ’ ఎత్తుగడ

22 Jul, 2020 05:57 IST|Sakshi

జిల్లాల్లో జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు యత్నాలు 

మూసివేత దశలోని వందల ప్రైవేటు కాలేజీల కొనుగోళ్లు 

ప్రభుత్వ, సాధారణ ప్రైవేటు కాలేజీల ఉనికికి ముప్పు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల విస్తరణ దిశగా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాల్లో మూసివేతకు సిద్ధంగా ఉన్న వందల కాలేజీలను కొనుగోలు చేసి, సొంతంగా క్యాంపస్‌ల ఏర్పాటుకు నాలుగు కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు బోర్డుకు దరఖాస్తు చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి. ఇంటర్మీడియట్‌ కాలేజీల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) దరఖాస్తుకు ఇచ్చిన గడువు ముగియకముందే తమ కాలేజీల్లో చేరాలంటూ ప్రచారానికి తెరతీశాయి. వీటి ప్రయత్నాలతో అంతంతగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, సాధారణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఘోరంగా దెబ్బతిననున్నాయి.

ఏటా ఇంటర్మీడియట్‌లో 4.5 లక్షల వరకు విద్యార్థులు చేరుతుంటే అందులో ప్రభుత్వ కాలేజీల్లో చేరికలు అతి కష్టంగా లక్షకు చేరువవుతున్నాయి. అదీ ప్రభుత్వ లెక్చరర్లు పదో తరగతి పాసైన విద్యార్థుల ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తేనే. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్‌ కాలేజీలు జిల్లాల్లోనూ విస్తరిస్తే ఇక ప్రభుత్వ కాలేజీలే కాక సాధారణ ప్రైవేటు కాలేజీలు ఉనికి కోల్పోతాయని సాధారణ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. 

లోపాలు, అక్రమాలకు అడ్డాగా.. 
కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు లోపాలకు, అక్రమాలకు అడ్డాగా మారాయి. ఆకర్షణీయ ప్రకటనలతో తల్లిదండ్రులను బోల్తాకొట్టించి, అనుమతుల్లేకుండానే విద్యార్థులను చేర్చుకొన్న ఘటనలు అనే కం ఉన్నాయి. బోర్డు నిబంధనలను ఉల్లంఘించి 66 కాలేజీలు పదేళ్లుగా కొనసాగాయి. ప్రమాదకర భవనాలు, ఇరుకైన గదుల్లో విద్యార్థులను ఉంచుతూ వేల రూపాయలు కొల్లగొడుతున్న ఆ కాలేజీల మూసివేతకు ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో ఇటీవల బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. అయినా అవే భవనాల్లోనే కాలేజీలను కొనసాగించేందుకు మళ్లీ దరఖాస్తు చేశాయి.

వీటిలో తమ దృష్టికి వచ్చిన రెండు కాలేజీల దరఖాస్తులను ప్రాథమిక దశలోనే బోర్డు తిరస్కరించింది. తాజాగా ఈ కార్పొరేట్‌ విద్యాసంస్థలు విస్తరణకు దిగడంతో కొత్త జిల్లాల్లోనూ కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌లోని ఒకటో రెండో బ్రాంచ్‌లకు చెందిన కొందరు టాప్‌ ర్యాంకర్లను చూపుతూ, తల్లిదండ్రుల్లో ర్యాంకుల ఆశ కల్పించి, విద్యార్థులను తమ కాలేజీల్లో చేరేలా చేస్తారు. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారు. ఇక సాధారణ ప్రైవేటు కాలేజీల్లో మంచి సబ్జెక్టున్న లెక్చరర్లను ప్రోత్సాహకాల ఎరతో లాగేసుకుంటారు. దీంతో అవి దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ కాలేజీల విస్తరణను అడ్డుకోవాల ని ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీష్‌ డిమాండ్‌ చేస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీల వల్ల సాధారణ ప్రైవేటు కాలేజీలే కాక ప్రభుత్వ కాలేజీలూ దెబ్బతింటాయన్నారు.  

226 కాలేజీలు ‘కార్పొరేట్‌’వే.. 
రాష్ట్రంలో 2,600 వరకు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. అందులో 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు కాగా, 1,686 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు. మిగతావి గురుకులాలు. ప్రైవేటు కాలేజీల్లో 226 వరకు ఆరు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు చెందినవే ఉన్నాయి. ప్రస్తుతం అవి హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, ఖమ్మం వరంగల్‌. కరీంనగర్‌ జిల్లాల్లో విస్తరించాయి. తాజాగా నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్, భువనగిరి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోనూ తమ కాలేజీల ఏర్పాటుకు యోచిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 226 మాత్రమే కార్పొరేట్‌ కాలేజీలున్నట్లు చెబుతున్నా.. అనధికారికంగా ఒక్కో కాలేజీ పేరుతో కార్పొరేట్‌ కాలేజీలు చాలా బ్రాంచీలను కొనసాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి సైతం వచ్చిందని, దీనిపై ఉన్నత స్థాయిలోనూ చర్చ జరిగినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు