వృత్తి పెయింటర్‌.. ప్రవృత్తి డ్యాన్స్‌ మాస్టర్‌.. 

14 Jul, 2019 09:52 IST|Sakshi

సాక్షి, అశ్వారావుపేట : ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు అశ్వారావుపేటకు చెందిన యువ నృత్య కళాకారుడు మహ్మద్‌ యాసిన్‌. అశ్వారావుపేటలోని ముస్లిం బజారుకు చెందిన మహ్మద్‌ యాసీన్‌కు చిన్నప్పటి నుంచి నృత్యం అంటే అమితాసక్తి. గొప్ప నృత్యకళాకారుడు కావాలనే కోరిక ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి తోడ్పాటు ఇవ్వలేదు. దీంతో టీవీల్లో వచ్చే నృత్య ప్రదర్శనలు చూస్తూ నృత్య సాధన చేశాడు. ఇలా గొప్ప డ్యాన్సర్‌ కావాలనే సంకల్పంతో తన నృత్య నైపుణ్యాలను మెరుగు పరుకున్నాడు. పేదరికం వెంటాడినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా గల్లీ స్థాయి నుంచి రంగుల ప్రపంచం(సినిమా రంగం)లోకి అడుగు పెట్టి యువ నృత్య కళాకారుడిగా ఎదిగారు.

పొట్ట కూటి కోసం రోజు వారీ కూలీగా పెయింటర్‌గా పని చేస్తూనే ఎంతో మంది చిన్నారులు, పెద్దలకు నృత్యాలు నేర్పిస్తూ తాను ఉపాధి పొందుతూ ప్రశంసలు పొందుతున్నాడు. నిన్న మొన్నటి వరకు గల్లీ డ్యాన్స్‌ మాస్టర్‌గానే రాణించిన ఈ యువ కళాకారుడు ఓ ద్విభాషా చిత్రానికి (ఇటీవలె ఆడియో రిలీజ్‌ కాగా, మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానున్నది.) కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తన సత్తా చాటాడు. ఇలా స్వయంగా నేర్చుకున్న నృత్యాన్ని తనతోపాటు మరో నలుగురికి నేర్పించి, తాను ఉపాధి పొందాలనే ఉద్దేశంతో 2002వ సంవత్సరంలో ‘స్వయంకృషి’ పేరుతో డ్యాన్స్‌ కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ సెంటర్‌లో చిన్నారులకు నృత్యాలు నేర్పిస్తూనే, అడపాదడపా చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

వాటికి మంచి స్పందన రావడంతో రెట్టింపు ఉత్సహంతో మరింత సాధన చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఉత్సహంతోనే టీవీల్లో ప్రసారం అవుతున్న డ్యాన్స్‌ ప్రొగ్రామ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నిస్తున్న క్రమంలోనే కొద్ది రోజుల్లోనే ఓ ప్రముఖ టీవీ చానల్‌లో నిర్వహించిన ‘ఢూం డిగడిగ’ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. అనంతరం 2005లో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్, 2008లో ‘ఆట’, ‘ఛాలెంజ్‌’ ప్రొగామ్స్‌లో పాల్గొన్నాడు. టీవీల్లో ప్రసారమైన ‘ఢీ’ షో, ‘రంగస్థలం’ పోటీల్లో తన శిష్యులకు అవకాశం దక్కింది. డ్యాన్స్‌ మాస్టర్‌ సత్య చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో రెండు బహుమతులు సాధించాడు. వాటితోపాటు హైదారాబాద్, ఖమ్మం, రాజమండ్రి, అశ్వారావుపేటలో జరిగిన అనేక కార్యక్రమాల్లో యాసిన్‌ నృత్యాలతో ఆకట్టుకున్నాడు. తన కోచింగ్‌ సెంటర్‌తోపాటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో దాదాపు ఇరవై వేల మంది చిన్నారులు, విద్యార్థులకు డ్యాన్స్‌ కోచింగ్‌ ఇచ్చాడు. ఇవే కాకుండా వేల సంఖ్యలో ప్రైవేట్, జాతర, శుభకార్యాల్లో నృత్య ప్రదర్శనలు చేశాడు.  
  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు