ఇక పంచాయతి పోరు షురు...

10 Dec, 2018 11:01 IST|Sakshi

ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు

ఓటర్ల ముసాయిదా విడుదల 

15న తుది జాబితా ప్రకటన

కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్‌/ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. రేపటితో అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములు కూడా తేలిపోనున్నాయి. ఇక పంచాయతీ పోరుపై దృష్టి పడింది. జనవరి 10లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గత అక్టోబర్‌లో ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం పంచాయతీల వారీగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబి తాను విడుదల చేశారు. ఈ జాబితాలో పేరు లేని బీసీలు సోమవారం నుంచి నమోదుతో పాటు మా ర్పులు, చేర్పులు చేసుకోవచ్చు. బీసీ ఓటర్ల జాబితా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉంచారు.

అధికారులు ప్రకటించిన ము సాయిదాలో బీసీ ఓటర్ల వివరాలు స్పష్టంగా ఉ న్నాయి. కాగా, ఇన్ని రోజులు ముందస్తు ఎన్నికల తో బీజీగా గడిపిన ఎన్నికల సంఘం, జిల్లా అధి కారులు ఇప్పుడు పంచాయతీపై దృష్టి పెట్టారు.


13,14న గ్రామసభలు.. 
ఉమ్మడి జిల్లాలో గల నాలుగు  జిల్లాల పంచాయతీ అధికారుల వద్ద ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,14,835 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఆదివారం విడుదల చేసిన బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా అనంతరం మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు.

ఏవైనా మార్పులు ఉన్నట్లయితే ఈ నెల 13, 14 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను ఈ నెల 14 సాయంత్రంలోగా పూర్తి చేసిన 15న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. విడుదల చేసిన జాబితాను పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపిస్తారు. అనంతరం ఆ జాబితా ప్రకారం రిజర్వేషన్లకు కేటాయింపుకు చర్యలు తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు.  

రిజర్వేషన్లపై ఆశ.. 
గత సర్పంచ్‌ల పదవీ కాలం గత ఆగస్టు 2తో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. సర్పంచ్‌ల పదవీ ముగిసే నెల ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత రిజర్వేషన్లపై చోటు చేసుకున్న పరిణామాలు హైకోర్టు వరకు తీసుకెళ్లాయి. ఆ సమయంలో 2019 జనవరి 10లోగా పంచాయతీలకు ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో ఊపిరి పీల్చుకున్న ఎన్నికల సంఘం తద్వారా వచ్చిన ముందస్తు ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది. ఇప్పుడు ఆ ఎన్నికలు ముగియడంతో పంచాయతీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీసీ ఓటర్ల తయారీ జాబితా ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ నుంచి ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పుడు అధికారులు జాబితాను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.

అనంతరం ఆ జాబితా ప్రకారం తాజాగా ఖరారు కానున్న రిజర్వేషన్ల కోసం జిల్లా వాసులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సర్పంచ్‌ పదవులకు బీసీలు, ఎస్టీ, ఎస్సీలు అందరు ముందుకు రావడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

 
ఓటరు జాబితా ప్రదర్శన
ఆసిఫాబాద్‌: పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని బీసీ ఓటర్ల జాబితాను ఆదివారం  మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించినట్లు ఈవోపీఆర్డీ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించామని, సోమవారం ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, 12న పరిష్కరిస్తామని, 13 నుంచి 14 వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 15న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.    

>
మరిన్ని వార్తలు