వహ్వా పాయా.. ఏమి రుచిరా !

7 Jul, 2019 11:18 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : చలి, వర్షా కాలాలు వచ్చాయంటే చాలు నోరూరించే వేడి వేడి పాయాను తినాల్సిందే అంటున్నారు నగర వాసులు. నగరంలో సుభాష్‌నగర్, నెహ్రూపార్క్, తిలక్‌గార్డెన్‌ లైన్, రైల్వే స్టేషన్‌ లాంటి నాలుగైదు ప్రాంతాల్లోనే లభించే ఈ నాన్‌వెజ్‌ వంటకం కోసం పోటీ పడుతున్నారు. దీంతో మధ్యాహ్నానికే హోటళ్లలో పాయా వంటకం ఖాళీ అవుతోంది. దీంతో ఎంత దొరికితే అంత ఆర్డర్‌ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు వెచ్చించడానికి పాయా ప్రియుడు వెనుకాడడం లేదు. అయితే ఇంత టేస్టీగా ఉండే పాయాను ఎందుకు ఇష్టపడి తింటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

శ్రమపడితేనే రుచి... 
పాయాను పొట్టేలు, మేక కాళ్లతో తయారు చేస్తారు. కాళ్లను కాల్చి గోధుమ పిండి సహాయంతో వాటి వెంట్రుకలను తొలగిస్తారు. తర్వాతా శుభ్రంగా కడుగుతారు. ఒక పాత్రలో కాళ్లను, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిర్యాలు, సొంటి, కొబ్బరి, ఇత ర మసాల దినులు వేసి నీళ్లు పోసి రెండు, మూడు గంట ల పాటు మరిగిస్తారు. అనంతరం కారంపొడి, ఉప్పు, కావాల్సిన పదార్థాలు వేస్తారు. అధికంగా సూప్‌ ఉంచి అన్ని కలిసేదాక మరిగిస్తారు. దీంతో ఘుమఘుమలాడే పాయా సిద్ధమవుతుంది. పాయా తయారీ శ్రమతో కూడుకున్న పనే అయినప్పటికీ, దానికున్న రుచి మరే నాన్‌వెజ్‌ వంటకానికి రాదని తయారీ దారులు చెప్తున్నారు. ఆయా హోటళ్లలో ఒక ప్లేట్‌ పాయా రూ.100 విక్రయిస్తున్నారు. రైస్‌తో కావాలంటే రూ.140 చెల్లించాలి. 

ఎముకలకు బలంగా.. 
పాయా వంటకం రుచికే కాకుండా ఆరోగ్యానికి మంచిదంటున్నారు.ఎముకలకు బలాన్ని ఇస్తుంది. నీళ్ల నొప్పులుంటే తప్పిపోతాయి. ఒంట్లో వేడి పుట్టించి జలుబు చేసిన వారికి సూప్‌ ఎంతగానో సహాయకారిగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు విరిగిన వారికి పొట్టేలు, మేక కాళ్లను ఉడికించిన సూప్‌ను ఎలాంటి మసాలాలు లేకుండా తాగితే త్వరగా అతుక్కుంటాయని చాలా మంది చెప్తుంటారు.

ఇదొక ప్రత్యేకమైన వంట..
పాయా అనేది హోటళ్లలో చాల అరుదుగా లభిస్తుంది. దీనిని రుచిగా తయారు చేయాలంటే వంటకంలో అనుభవం ఉండాలి. అన్ని మసాలాలు కలిసి రుచిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాయా కోసం ఒక రోజు ముందుగానే చాల మంది ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తుంటారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా