పనివ్వకుండా జీతమిస్తున్నారు

12 Mar, 2018 08:01 IST|Sakshi
రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనరేట్‌ కార్యాలయం

పదోన్నతులు ఇచ్చారు.. పోస్టింగ్‌ మరిచారు.!

మూడు మాసాలుగా పోస్టింగ్‌ లేకుండా వేతనాలు

రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ శాఖలో వింత వైఖరి

సాక్షి,సిటీబ్యూరో:  రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ తీరు మారడం లేదు. పరిపాలనా పరమైన వ్యవహారాల్లో సైతం నిర్లక్ష్యం వీడటం లేదు. ఒక వైపు ఖాళీలు వెక్కిరిస్తున్నా... కీలక పోస్టులు కూడా భర్తీకి నోచుకోవడం లేదు. కింది స్థాయిలో కనీసం పదోన్నతులు ప్రక్రియ ఉసే లేకుండా పోగా, గెజిటెడ్‌ స్థాయిలో మాత్రం నామమాత్రంగా పదోన్నతులు కల్పిస్తున్నా.. పోస్టింగ్‌లు మాత్రం కేటాయించడం లేదు.  ఫలితంగా వారిని నెలల తరబడి ఖాళీగానే కూర్చో బెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రిజిస్ట్రేషన్‌ శాఖకు పూర్తి స్థాయి పరిపాలనాదీశుడు లేక ఇంచార్జీలతో కొనసాగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌  శాఖలో  ఇద్దరు జిల్లా రిజిస్ట్రార్లకు డీఐజీలు గా, ఐదుగురు గ్రేడ్‌–1 సబ్‌ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ గతేడాది 31న ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా రిజిస్ట్రార్, మేడ్చల్‌ జిల్లా రిజిస్ట్రార్లు  డీఐజీలు గా పదోన్నతులు లభించడంతో వెంటనే రిలీవ్‌ అయి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతుల పొందిన ఐదుగురు గ్రేడ్‌–1 సబ్‌ రిజిస్ట్రార్లు సైతం రిలీవ్‌ అయి సంబంధిత శాఖలో రిపోర్టు చేశారు. వారికి ఇప్పటి వరకు  పోస్టింగ్‌ కేటాయించక పోవడం విస్మయానికి గురిచేస్తోంది.

వెక్కిరిస్తున్న ఖాళీలు
రిజిస్ట్రేషన్‌ శాఖలో రెండు డీఐజీ పోస్టులతోపాటు 12 రిజిస్ట్రార్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్‌ డీఐజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి డీఐజీగా పదోన్నతుల పొందిన ఇద్దరికి ఆయా పోస్టుల్లో భర్తీ చేయవచ్చు. కానీ ఇప్పటి  వరకు కేటాయించలేదు. మరోవైపు ఇతర డీఐజీలకు అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు.  మరోవైపు హైదరాబాద్‌ సౌత్, మేడ్చల్‌ జిల్లా రిజిస్ట్రార్లతో మరో పది డీఆర్‌ పోస్టులు ఖాళీగా ఇంచార్జిలతో కొనసాగుతున్నాయి. గ్రేడ్‌–1 సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన ఐదుగురితో ఖాళీగా గల డీఆర్‌ పోస్టింగ్‌లు భర్తీ చేయవచ్చు.. కానీ, ఇప్పటి వరకు ఆ దిశ చర్యలకు ఉపక్ర మించడంలేదు. ఎలాంటి సేవలు తీసుకోకుండానే  జీతాలు ఇవ్వడం నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. ఇటీవల కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఇంచార్జి కమిషనర్‌ దృష్టికి పదోన్నతులు పొందిన వారు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది.

నాలుగేళ్ల నుంచి
రిజిస్ట్రేషన్‌ శాఖలో నాలుగేళ్ల నుంచి సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు   లేకుండా పోయా యి.  సుమారు 50 వరకు గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నా ...వాటిని భర్తీ చేయడం లేదు. పదోన్నతుల జాబితాలో  పెద్ద ఎత్తున సీనియర్‌ అసిస్టెంట్లు ఉన్నా  ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మొత్తంమీద  రిజిస్ట్రేషన్‌ శాఖలో క్యాడర్‌ సంఖ్య 3,930 ఉండగా అందులో 590 పోస్టులు మినహా అన్ని పోస్టులు ఖాళీగా నే వెక్కిరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు