పనులెందుకు జరుగుతలేవ్‌? 

2 Apr, 2019 04:04 IST|Sakshi
చేతిలో కర్రతో ఈఈ తిరుపతిరావు (భుజానికి బ్యాగ్‌ వేసుకున్న వ్యక్తి ఏఈ విలాస్, పక్కన కాంట్రాక్టర్‌)

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ విలాస్‌కు ఈఈ బడితె పూజ 

తొడపై వాతలు వచ్చేలా కొట్టిన పెద్దపల్లి ఈఈ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ ధర్మారం: కింది స్థాయిలో కొత్తగా చేరిన ఇంజనీర్‌కు బడితె పూజ చేస్తే తప్ప అప్పగించిన పనులు పూర్తి కావనుకున్నాడో ఏమో ఆ అధికారి. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే చండశాసనుడైన అధికారి ఎవరినీ ఉపేక్షించడు అనే సందేశాన్ని ఇతర అధికారులకు కూడా పంపించాలనుకున్నాడు ఆ సారు. ఇంకేముంది కర్రతో వాతలు పెట్టే పని మొదలుపెట్టి.. ఆ ఘన కార్యాన్ని వీడియో సైతం తీయించారు! అది కాస్తా వైరల్‌ అవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత శాఖ సిబ్బంది కథనం ప్రకారం.. మండలంలోని మేడారం, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈఈ తిరుపతిరావు నందిమేడారం గ్రామంలో కొనసాగుతున్న పనుల పరిశీలనకు వెళ్లారు.

నందిమేడారంలోని ఆలయం వద్ద పైప్‌లైన్‌కు, ట్యాంకు మధ్య ఇంటిగోడ ఉండటంతో పైప్‌లైన్‌ లింకేజీ పని పూర్తి కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈఈ.. కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆయన సమక్షంలోనే పైప్‌లైన్‌ లింక్‌ ఎందుకు పూర్తి చేయలేదని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను కర్ర తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న మహిళా వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ని పిలిచి సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరణ చేయాలని అన్నారు. ఆమె వీడియోలో చిత్రీకరిస్తుండగా, ఎందుకు పనులు చేయించడం లేదని కర్రతో తొడలు, మోకాళ్లపై కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఏఈ విలాస్‌ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడే ఉన్న డీఈఈ రాజ్‌కుమార్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లిస్తున్నా పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సమాధానాలు చెబుతున్నా వినిపించుకోకుండా చేతిలో కర్రను ఊపుతూ ఈఈ చేస్తున్న హంగామాను డీఈ సైతం ఆశ్చర్యంగా చూడటం గమనార్హం.

అక్కడ నుంచి ధర్మారంలోని మసీద్‌ వద్దకు వచ్చి పైప్‌లైన్‌ లింక్‌ ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా.. లింక్‌ చేసే అనుభవమున్న మెకానిక్‌లు దొరకటం లేదని సమాధానం చెప్పినప్పటికీ వినకుండా తిట్ల వర్షం కురిపించినట్లు సమాచారం. ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి కిందిస్థాయి అధికారిని కారులోనే తీసుకువెళ్లి అక్కడ కూడా పనుల జాప్యంపై ఆగ్రహించారు. కాగా ఆయా గ్రామాల్లోని కాంట్రాక్టర్లకు ఎన్ని సార్లు చెప్పినప్పటికి స్థానికంగా నెలకొన్న వివిధ సమస్యలతో పనులు ముందుకు సాగటం లేదని ఏఈ చెప్పినా వినిపించుకోకుండా మందలించినట్లు సమాచారం. అక్కడి నుంచి తిరిగి వారిని పెద్దపల్లికి తీసుకువచ్చినట్లు ఏఈ తెలిపారు.

కొత్తగా ఏఈగా ఉద్యోగంలో చేరిన విలాస్‌ తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికి గురై అదే రాత్రి యూనియన్‌ నాయకులకు సమాచారం అందించారు. మంగళవారం యూనియన్‌ నాయకులతో కరీంనగర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని కలసి ఈఈ చేసిన నిర్వాకాన్ని, తన తొడలపై వచ్చిన వాతలను చూపించి ధర్నా నిర్వహించారు. ఈఈ చేసిన బడితెపూజపై అధికార యంత్రాంగంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు