‘ఆసరా’ దొరకదేమోనని..!

15 Dec, 2014 03:44 IST|Sakshi
  • పింఛన్ బెంగతో 13 మంది మృతి
  • సాక్షి నెట్‌వర్క్: పింఛన్ రాదేమోనని.. రాలేదన్న బెంగతో వేర్వేరు జిల్లాల్లో పదమూడు మంది మృతి చెందారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన చీకటి రామయ్య(80), కూసుమంచి మండలం గంగబండ తండ పంచాయతీలోని బోటిమీది తండాకు చెందిన బానోతు బాబు(75), కల్లూరులోని పుల్లయ్య బంజర్ రోడ్డుకు చెందిన వికలాంగుడు ఎస్‌కే కమ్లి(70)లకు గతంలో పింఛన్ వచ్చేది.

    వీరు అందరితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అర్హుల జాబితాలో వీరి పేర్లు రాలేదు. ఇప్పటి వరకు తమకు ఆసరాగా ఉన్న పింఛన్ ఇక రాదేమోనని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బెంగతో శనివారం రాత్రి చీకటి రామయ్య, ఆదివారం బాణోత్ బాబు, కమ్లిలు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌కు చెందిన కొమ్ము ముత్తయ్య(72)కు కొన్నేళ్లుగా పింఛన్ వచ్చేది.

    కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో బెంగపెట్టుకున్నాడు. ఉదయం ఆరు గంటలకు భార్య వెళ్లి చూడగా, చనిపోయి ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్ బస్తీకి చెందిన పున్నా ఎల్లయ్య(70) ఆదివారం ఉదయం ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ స్కూల్ వద్ద షేక్‌పేట మండలాధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలుసుకొని వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉన్నాడు. అయితే పింఛన్లు ఇవ్వడం లేదని తెలుసుకొని నిరాశగా తిరిగి ఇంటికి బయలుదేరాడు.

    ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో గుట్టపై నుంచి వస్తూ పడిపోయి చనిపోయాడు.   ఎల్లయ్య మృతదేహాన్ని షేక్‌పేట తహశీల్దార్ చంద్రకళ సందర్శించారు. అనారోగ్యంతోనే ఎల్లయ్య మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య రత్నమ్మకు పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 5 వేలు సహాయం అందజేశారు. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం గున్నెల్లికి చెందిన చిలకమారి అనసూర్య(70) పింఛన్ కోసం మూడు రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది.

    ఆమెకు పింఛన్ రాలేదని అధికారులు చెప్పడంతో అన్నం తినకుండా బెంగ పెట్టుకుంది. ఆదివారం ఉదయం చూడగా, చనిపోయి ఉంది. తొర్రూరు మండలంలోని అరిపిరాలకు చెందిన గీత కార్మికుడు పూజారి సోమరాజులు(68) పింఛన్ల జాబితాలో పేరు రాకపోవడంతో బెంగ పెట్టుకున్నాడు. సమగ్ర కుటుంబ సర్వే ఫాం లేకపోవడంతో పింఛన్ రాలేదని అధికారులు వివరించారు. పింఛన్ రాలేదని బెంగతో రెండు రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం మృతి చెందాడు.

    వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌కు చెందిన పంగ లక్ష్మి( 80) పెన్షన్ రాలేదనే బెంగతో ఆదివారం వేకువ జామున మరణించింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఫాతిమాబేగం(75) పేరు పింఛన్ల జాబితా లో లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఆదివా రం సాయంత్రం చనిపోయింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన పెద్దబోయిన రాజవ్వ(80) పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మూడు రోజులుగా గ్రామపంచాయతీ చుట్టూ తిరిగింది.

    జాబితాలో పేరులేకపోవడంతో బెంగపడి కన్నుమూసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తికి చెందిన ఎండీ అక్బర్ అలీ(70) శనివారం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఉదయమే పంచాయతీ కార్యాలయానికి వెళ్లా డు. రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. అతని పేరు రాలేదు. జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురై రాత్రి భోజనం సరిగా చేయకుండా పడుకున్నాడు.

    ఆదివారం ఉదయం చూడ గా, చనిపోయి ఉన్నాడు. ఇదే జిల్లా దుబ్బాకకు చెందిన అల్లం బాల్‌లక్ష్మి(50)కి గతంలో పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో పేరు లేకపోవడంతో మ నస్తాపంతో అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లామద్దూరుకు చెందిన నీలి బసప్ప(85) వృద్ధాప్య పింఛన్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. జాబితాలో తనపేరు లేకపోవడంతో కుంగిపోయి చివరకు ఆదివారం ఇంట్లోనే కన్నుముశాడు.
     

మరిన్ని వార్తలు