పింఛన్ పంచాయితీ

15 Dec, 2014 23:47 IST|Sakshi

పింఛన్ల కోసం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం సైతం వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలకు దిగారు. పింఛన్ కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అన్ని అర్హతలున్నా తమకు ఎందుకు మంజూరు చేయరంటూ బాధితులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహావేశాలతో పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకూ వెళ్లేది లేదంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. పలుచోట్ల వివిధ రాజకీయ పక్షాల నాయకులు వారికి అండగా నిలుస్తుండడంతో పరిస్థితి మరింత వేడెక్కుతోంది.
 
నేను అర్హుడిని కాదా..?
మర్పల్లి: 80 ఏళ్లకు పైగా ఉన్న ఇతను మండల పరిధిలోని బూచన్‌పల్లి గ్రామానికి చెందిన అత్తెల్లి పెంటయ్య. మొన్నటివరకూ వృద్ధాప్య పింఛన్ వచ్చింది. ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే జాబితాలో పేరు రాలేదు. దీంతో సోమవారం ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు. తమ లాంటి వృద్ధులకు కాకుండా ఎవరికి పింఛన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నాడు.  
 
అధికారుల తప్పిదంతో పింఛన్ కట్ ..
తాండూరు రూరల్: ఈ చిత్రంలో సదరం సర్టిఫికెట్ చూపిస్తున్న యువతి పేరు కుర్వ విజయలక్ష్మి (21). మండల పరిధిలోని గోనూర్ గ్రామానికి చెందిన ఈమెకు రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 2011లో అధికారులు విజయలక్ష్మికి (ఐడీ నంబర్ -15201230300122013) సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే నంబర్ మీద అదే గ్రామానికి చెందిన వికలాంగురాలు కావలి ఎల్లమ్మకు సైతం సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో ఇద్దరికీ రూ.500 పింఛన్ వచ్చింది. అయితే కుర్వ విజయలక్ష్మి సర్టిఫికెట్‌పై ఫొటో మాత్రమే ఆమెది ఉంది. పేరు కావలి ఎల్లమ్మ అని ఉంది. దీంతో విజయలక్ష్మి సదరం సర్టిఫికెట్ తప్పుగా ఉందని అధికారులు ఆమె పేరును పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఆందోళనతో తండ్రి కుర్వ బిచ్చప్ప కూతురును ఎత్తుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.  
 
వింతలెన్నో..!
యాలాల: పింఛన్లలో రోజుకో వింతలు.. ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. చోటుచేసుకుంటోంది. అన్ని అర్హతలున్నా పింఛన్ రానివారు కొందరుంటే.. భర్త ఉన్నప్పటికీ ఓ మహిళ వితంతువు అంటూ పింఛన్ మంజూరు చేశారు.  

భర్త ఉన్నా వితంతు పింఛన్..
మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు, ఈశ్వరమ్మ దంపతులు. రాములు కుమ్మరి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పింఛన్ల పంపిణీలో భాగంగా గ్రామానికి ఈఓపీఆర్డీ వసంతలక్ష్మితో పాటు స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్ హాజరయ్యారు. ఈశ్వరమ్మ వితంతు పింఛన్‌కు అర్హురాలిగా పేర్కొంటూ జాబితాలో ఫొటో వచ్చింది.  పింఛన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో ఎంపీటీసీ సభ్యుడు వీరేశం ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే జరిగిన పొరపాటును ఈఓపీఆర్డీకి తెలియజేయడంతో ఆమె పేరును జాబితా నుంచి తొలగించారు.

వికలాంగురాలైనా జాబితాలో పేరు లేక..
యాలాల మండల కేంద్రానికి చెందిన శారదకు కుడిచేయి లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో సదరం సర్టిఫికెట్ కూడా జత చేసింది. కానీ ఆమెను జాబితాలో చేర్చలేదు. పింఛన్ డబ్బులు వస్తాయనే ఆశతో పంచాయతీ కార్యాలయం వద్ద ఎదురుచూసిన శారదకు జాబితాలో పేరు రాలేదని తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైంది.
 
సదరం ఉన్నా..పింఛన్ రాలేదు..
యాలాలకు చెందిన వర్ల సాయికుమార్ మానసిక వికలాంగుడు. తన పనిని తాను స్వతహాగా చేసుకోలేని దుస్థితి. సదరం క్యాంపులో భాగంగా వైద్యుడు సాయికుమార్‌కు 64 శాతం మానసిక వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించాడు. సాయికుమార్ పేరు సైతం పింఛన్ జాబితాలో రాలేదు.

మరిన్ని వార్తలు