పక్కాగా లబ్ధిదారుల ఎంపిక

13 Oct, 2014 03:35 IST|Sakshi

నారాయణపేట :
 తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హత గల వారికి అందించే బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో నారాయణపేట ఆర్డీఓ స్వర్ణలత అధ్యక్షతన డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వివిధ శాఖల మండల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆహార భద్రతా కార్డులు, పింఛన్‌ల దరఖాస్తులను గ్రామస్థాయిలో వీఆర్వోలు, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది స్వీకరించాలని, రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఈనెల 15వరకు దరఖాస్తులు స్వీకరించి, 16న జరిగే విచారణలో ఏఏ అంశాలకు సంబందించి పరిగణలోకి తీసుకుని నిర్ధారించాలనే విషయంపై అవగాహన కల్పించారు.

సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారంగా చేసుకుని దరఖాస్తుల స్వీకరణ సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. ఒకే కుటుంబంలో నివసిస్తూ ఆహారభద్రత కార్డుల కోసం వేర్వేరుగా అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆహార భద్రతకార్డులు పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి లక్షా 50వేలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు అని తెలిపారు.

రెండున్నర ఎకరాల తరి, 5ఎకరాల మెట్టభూమి ఉన్న వారికి ఆహార భద్రతకార్డులు ఇవ్వకూడదని చెప్పారు. ఈ విషయంలో విచారణ సర్వే బృందం నేరుగా ఇంట్లోకి వెళ్లి ఇంటి స్థితిగతులు, ఆదాయ మార్గా లు, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, వ్యాపారం వంటి వాటిని నిశితం గా పరిశీలించాలని ఆదేశించారు. వంట గది మినహాయించి 3గదుల ఆర్‌సీసీ స్లాబ్‌తో కూడిన ఇల్లు ఉండే కూడా అనర్హులుగా గుర్తించి నమోదు చేసుకోవాలని చెప్పారు.

ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగవద్దని ఆదేశించారు. ఒకవేళ పొరపాటు చేస్తే సంబంధిత అధికారి బాధ్యత వహించా ల్సి ఉంటుందని చెప్పారు. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం జత చేసేలా చూడాలని సూచించారు. ఇప్పుడున్న రేషన్‌కార్డులు, అన్నిరకాల పింఛన్‌లు వచ్చేనెల నుంచి అమలు కాబోవని స్పష్టం చేశారు.

అందువల్ల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పారు. ఆర్డీఓ స్వర్ణలత మాట్లాడుతూ దారిధ్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. గత కుటుంబ సమగ్ర సర్వేతో పాటు నేటి విచారణను జోడించి అర్హులను గుర్తించాలని చెప్పారు.

మరిన్ని వార్తలు