పీజీ.. క్రేజీ

26 May, 2015 01:23 IST|Sakshi
పీజీ.. క్రేజీ

* పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు పునర్‌వైభవం
* ఓయూ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ  
* గతేడాది కంటే 25 వేలు అధికం

 
సాక్షి,హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల విషయంలో గత వైభవం పునరావృతం అవుతోంది. పీజీ కోర్సులపై విద్యార్థుల్లో ఏటేటా క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రతి ఏటా అందుతున్న దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పదేళ్ల క్రితం వరకు విద్యార్థుల మొదటి ప్రాధాన్యత ఇంజినీరింగ్ విద్యదే. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. లక్షల మంది విద్యార్థులు బీటెక్ డిగ్రీల కోసం ఎంసెట్ రాయడానికి కుస్తీలు పడ్డారు. ఈ ప్రభావం డిగ్రీ, పీజీ కోర్సులపై పడింది. ఫలితంగా  పీజీ కోర్సుల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి.
 
 ఇంజనీరింగ్‌తో ఉపాధి లేదని...
ఒకప్పుడు బీటెక్ చేయడానికి క్యూ కట్టిన యువత మార్కెట్‌లో ఇంజనీరింగ్ విద్యకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాఫ్ట్‌వేర్, ఐటీ బూమ్ నీటి బుడగలా మారడంతో మళ్లీ పీజీ కోర్సులపై దృష్టి సారించింది. సంప్రదాయ పీజీ కోర్సులతో ఇంజనీరింగ్ కంటే మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయని విద్యార్థులు భావిస్తుండడం వల్లే మళ్లీ పీజీ కోర్సులకు దరఖాస్తులు పెరుగుతున్నాయని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. డిగ్రీ, పీజీ వంటి సంప్రదాయ కోర్సులు చే సి  కొంచెం కష్టపడితే సర్కారు కొలువులో సెటిలవ్వొచ్చని నేటి యువత భావిస్తోంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు మరో ఆలోచన లే కుండా సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులనే ఎంచుకుంటున్నారు.
 
 ఈ ఏడాది తీవ్ర పోటీ..
 గత మూడేళ్లుగా ఓయూ సెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అనూహ్యంగా 25 శాతం పెరిగింది. ఓయూ సెట్‌లో అర్హత సాధిస్తే మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు వర్సిటీలతోపాటు ఓయూ పరిధిలోని కళాశాలల్లో పీజీ చేసుకోవచ్చు. మొత్తం 52 కోర్సుల్లో ప్రవేశాల్లో చేరేందుకు ఓయూ సెట్ అవకాశం కల్పిస్తోంది. ఇందులో 39 పీజీ ప్రోగ్రాంలు, 10 డిప్లోమా, 3 ఇంటిగ్రేట్ పీజీ ప్రోగ్రాంలు ఉన్నాయి.
 
  2015-16 విద్యా సంవత్సరానికి 1.05 లక్షల ద రఖాస్తులు అందాయి. గతేడాది ఈ సంఖ్య 79,644 లే. అంటే ఒక్క ఏడాదికే దరఖాస్తుల సంఖ్య 25 వేలకు పెరిగింది. ఈ విద్యా సంవత్సరానికి అత్యధికంగా ఎంకాంకు 13 వేలకుపైగా, గణితానికి 9,400, కెమిస్ట్రీకి 7,700, పొలిటికల్ సైన్స్‌కు 6,300 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఓయూ అడ్మినిస్ట్రేటివ్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్. గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు