రోహిణీ కార్తె ( మే 25 నుంచి )

26 May, 2015 01:26 IST|Sakshi
రోహిణీ కార్తె ( మే 25 నుంచి )

వైభవోపేతం.. సంప్రదాయ వరి విత్తనోత్సవం!
 30, 31 తేదీల్లో తమిళనాడులో పాడీ ఫెస్టివల్


 కొండ కోనల్లో పుట్టే నీటి బుగ్గ నుంచి ఉబికివచ్చే చిన్నపాటి జల ధారే మహాన దికి పురుడుపోస్తుంది. తమిళనాడులోని అధిరంగం           (తంజావూరుకు 40-50 కి.మీ.ల దూరం) అనే ఊళ్లో ఏటా జరుగుతున్న దేశవాళీ వరి వంగడాల ఉత్సవం కూడా ఇటువంటిదే. పదేళ్ల క్రితం తొలుత 50 మంది వరి రైతులు పాల్గొని తాము సాగు చేస్తున్న అపురూపమైన సంప్రదాయ వరి విత్తనాలను, సేంద్రియ సేద్య అనుభవాలను పంచుకున్నారు. గతేడాది ఈ విత్తనోత్సవంలో 4 వేల మంది రైతులు పాల్గొన్నారు. దీని ద్వారా పంపిణీ అయిన సంప్రదాయ వరి విత్తనాలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 22 వేల మంది రైతులు సాగు చేస్తున్నారని అంచనా. కొద్ది మంది తెలుగు రైతులూ వీరిలో ఉన్నారు. ఈ ఏడాది మే 30, 31 తేదీల్లో ఈ ఉత్సవం జరగనుంది. అక్కడ విత్తనాలు అమ్మరు.. పంచుకుంటారు. ఈ ఏడాది 2 కిలోల విత్తనం ఉచితంగా తీసుకున్న రైతు.. వచ్చే ఏడాది 4 కిలోల విత్తనం తెచ్చివ్వాలి. ఉచిత భోజన, వసతి సదుపాయాలు ఉంటాయి.  
 అంతరించిపోతున్న దేశీయ వరి విత్తనాలను సేకరించి, విత్తనోత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవడంలో అధిరంగం పాడీ ఫెస్టివల్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘సేవ్ అవర్ రైస్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ మహా విత్తనోత్సవం స్ఫూర్తిదాయకంగా సాగుతున్నది.
 సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ విజ్ఞానాన్ని తమ భాష(తమిళం)లో రైతులే నేరుగా తోటి రైతులకు అందిస్తుండటం విశేషం. సేంద్రియ వ్యవసాయోద్యమ పితామహుడు దివంగత నమ్మాళ్వార్ శిష్యుడు జయరామన్ ఈ విత్తనోత్సవాన్ని దీక్షతో నిర్వహిస్తున్నారు. జయరామన్ చదువుకున్నది ఏడో తరగతే అయినప్పటికీ ఆయన ‘కృషి’ని గుర్తించిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులో ప్రవేశం కల్పించింది. సేంద్రియ వరి సేద్యంపై విద్యార్థులకు క్లాసులు తీసుకునే అవకాశం కూడా జయరామన్‌కు ఇవ్వడం మరో విశేషం.

 నాబార్డు తోడ్పాటుతో జరగనున్న ఈ విత్తనోత్సవంలో వేలాది మంది రైతులతోపాటు శాస్త్రవేత్తలూ పాల్గొంటున్నారు. సంప్రదించాల్సిన నంబర్లు: శ్రీధర్- 099953 58205, అధిరంగం సెంటర్- 04369 220954, 098426 07609. డా. డి. నరసింహారెడ్డి- 090102 05742.
 

తేనెటీగలను మింగేస్తున్న పురుగుమందులు!

 అమెరికాలో తేనెటీగల సంఖ్య విపరీతంగా తగ్గిపోతున్నది. గత ఏడాది(2014 ఏప్రిల్- 2015 ఏప్రిల్)లో 42.1% తేనెటీగలు మృత్యువాతపడ్డాయని అమెరికా వ్యవసాయ శాఖ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారణైంది. అక్కడ శీతాకాలంలో తేనెటీగలు చనిపోవడం కొత్తేమీ కాదు. 2014-15 చలికాలంలో 23 శాతం తేనెటీగలు చనిపోయాయి.చలికాలంలో కన్నా వేసవిలో ఎక్కువగా తేనెటీగలు చనిపోతుండడం వ్యవసాయ శాస్త్రవేత్తలను, పర్యావరణవేత్తలను కలవరపరుస్తున్నది.

 ‘తేనెటీగల పెంపకం కేంద్రాల్లో వేసవిలో మూకుమ్మడిగా తేనెటీగలు చనిపోవడం చాలా అసాధారణం. ఈ పరిస్థితి చూస్తుంటే.. ఫ్లూ మరణాలు శీతాకాలంలో కన్నా వేసవిలో ఎక్కువగా జరుగుతున్నట్లుగా ఉంది..’ అని తేనెటీగలపై అధ్యయనంలో పాల్గొన్న మేరీలాండ్ విశ్వవిద్యాలయ నిపుణుడు డెన్నిస్ వాన్ ఎంగెల్స్‌డార్ప్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం నియోనికోటినాయిడ్స్ వంటి అత్యంత హానికరమైన పురుగుమందుల వాడకమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా పర్యావరణ రక్షణ సంస్థ నియోనికోటినాయిడ్స్ వాడకంపై మారటోరియం విధించింది. తేనెటీగల బాగోగులు చూడటం కోసం గత జూన్‌లో ఒబామా ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను నియమించినా 42.1 శాతం తేనెటీగలు చనిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పంటల్లో పరపరాగ సంపర్కం 80 శాతం వరకు తేనెటీగల ద్వారానే జరుగుతున్నది. అత్యంత ప్రమాదకరమైన రసాయనిక పురుగుమందులు వాడటం మానేసి సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించాలని పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పని సజావుగా చేస్తే తేనెటీగలతోపాటు మానవాళి పది కాలాల పాటు పచ్చగా మనుగడ సాగిస్తుంది.
 
 వడగళ్లకు జంకని ‘జుంకా బాసుమతి’!
     
ఎకరానికి 14 క్వింటాళ్ల దిగుబడి  ఈ వంగడం రూపకర్త సాధారణ సేంద్రియ రైతు  ఉత్తర భారతదేశాన్ని ఈ ఏడాది అతలాకుతలం చేసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలు కోతకొచ్చిన బాసుమతి పంటను చాలా వరకు ధ్వంసం చేశాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే ‘జుంకా బాసుమతి’ అనే సరికొత్త వంగడం మాత్రం అకాల వర్షాలకు పెద్దగా దెబ్బతినలేదు! అదే దీని విశిష్టత. ఇది ఒక సాధారణ రైతు రూపొందించిన వంగడం కావడం విశేషం.

 బరేలీకి చెందిన అనిల్ సహానీ అనే రైతు ఈ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం తుపానులకు పడిపోకుండా ఉండటంతోపాటు చీడపీడలను కూడా సమర్థవంతంగా తట్టుకుంది. రసాయన ఎరువులు వాడితే వేళ్లు బలహీనపడి భూమి లోపలకు చొచ్చుకుపోలేవని, వేళ్లు బలంగా ఉంటేనే ఎంతటి పెనుగాలులనయినా మొక్కలు తట్టుకుంటాయని అనిల్ చెప్పారు. ‘సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే.. వేళ్లు బలపడటానికి అవసరమైన మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలను మొక్కలు గ్రహిస్తాయి. రసాయనిక ఎరువులు వేసి పండించిన సాధారణ బాసుమతి కన్నా జుంకా బాసుమతి అన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి కూడా అని ఆయన అంటున్నారు. గత ఐదేళ్లుగా అనిల్ ఈ కొత్త వంగడాన్ని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ.. ఎకరాకు 14 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నాడు! దీని పంటకాలం 110 రోజులు. బరేలీలోని కృషి విజ్ఞాన కేంద్రం(భారతీయ పశు వైద్య పరిశోధనా సంస్థకు అనుబంధం) ఈ వంగడంపై అనిల్ తరఫున పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.
 
 

మరిన్ని వార్తలు