ప్రారంభించి.. తాళమేశారు..

31 Aug, 2017 02:29 IST|Sakshi
ప్రారంభించి.. తాళమేశారు..

రెండేళ్ల క్రితం నిర్మించిన పీహెచ్‌సీల దుస్థితి ఇదీ..
► రూ.78 లక్షలతో ఒక్కో భవనం నిర్మాణం
► సిబ్బందిని మాత్రం నియమించని ప్రభుత్వం
►   దీంతో నిరుపయోగంగా54 పీహెచ్‌సీలు
►   ప్రభుత్వ వైద్యం అందక.. పట్నం పోతున్న పేదలు  

సాక్షి, హైదరాబాద్‌: సిద్ధాపురం.. వరంగల్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వరంగల్‌కు రావా ల్సిందే. చుట్టు్టపక్కల ఉన్న మరో ఐదు ఊళ్లదీ ఇదే పరిస్థితి. రెండేళ్ల క్రితం సిద్ధాపురంలో రూ.78 లక్షలతో అత్యాధునిక వసతులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) నిర్మించి.. వైద్య అధికారులు ఘనంగా ప్రారం భోత్సవం నిర్వహించారు. అయితే అదే రోజు సాయంత్రమే ఆ ఆస్ప త్రికి పెద్ద తాళం వేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పీహెచ్‌సీ తెరుచుకో లేదు. పది వేల మందికి వైద్య సేవలు అందించేం దుకంటూ నిర్మించిన ఆ ఆస్పత్రిలో ఒక్కరూ చికిత్స పొందలేదు. ఒక్క సిద్ధాపురంలోనే కాదు.. రాష్ట్రంలోని మరో 53 ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోట్లు ఖర్చు చేసి 54 కొత్త పీహెచ్‌సీలను నిర్మించారు. అయితే వైద్యులు, సిబ్బందిని నియమించడం మాత్రం మరిచిపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందడంలేదు. అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి.. చికిత్సలు చేయించుకుంటున్నారు.

పడావుగా ఉన్న పీహెచ్‌సీలు ఇవే..
మైసిగండి, చారకొండ, రాచలూర్, ఎలిమినే డు, లేమూరు, మైలార్‌దేవరపల్లి (రంగారెడ్డి), రామయ్యగూడ, కోట్‌పల్లి, కరీంపూర్‌ (వికారా బాద్‌), కుషాయిగూడ (మేడ్చల్‌), బొడ్డుపల్లి, ఎ.డి.పల్లి (నల్లగొండ), తంగడపల్లి, వెలివెత్తి (భువనగిరి), రామక్కపేట, సిరిగిరిపల్లి, రాజ్‌గోపాల్‌పేట, అక్కన్నపేట (సిద్దిపేట), బొల్లారం, తుర్కపల్లి (సంగారెడ్డి), పులిమా మిడి (మహబూబ్‌నగర్‌), రాజోల్‌ (గద్వాల), శ్రీరంగాపూర్‌ (వనపర్తి), తోటపల్లి(నాగర్‌కర్నూలు), గోవింద్‌పేట, పెగడపల్లి, బినోల, ఎర్గట్ల (నిజామాబాద్‌), దేవన్‌పల్లి, పుల్కల్‌ (కామారెడ్డి), పైడిపల్లి, కొండపర్తి, సిద్ధాపూర్‌ (వరంగల్‌ అర్బన్‌), మల్యాల, కురవి (మహబూబాబాద్‌), ఒబుల్‌ కేశవపూర్, తాటికొండ, ఇప్పగూడ (జనగామ), దెందుకూ రు, చెన్నూరు, బొడులబండ, వల్లభి(ఖమ్మం), ఆసిఫ్‌నగర్, చన్నంపల్లి, గుములాపూర్‌ (కరీంనగర్‌), కూనారం, బేగంపేట (పెద్దపల్లి), నేరెళ్ల (జగిత్యాల), హన్మాజిపేట, లింగంపేట(సిరిసిల్ల), తాళ్లగురిజాల (మంచిర్యాల), బట్‌పల్లి, ఉషేగామ్‌ (ఆసిఫాబాద్‌), మహగామ్‌ (నిర్మల్‌).

రూ.39.85 కోట్లతో.. 54 పీహెచ్‌సీలు
13వ ఆర్థిక సంఘం (2010–15) నిధులతో 54 పీహెచ్‌సీలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది. 2016లో భవనాల నిర్మాణం పూర్తయింది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.78 లక్షలు.. మొత్తంగా 39.85 కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా భవనాలు నిర్మించిన 51 పీహెచ్‌సీలు, భవనాలు లేని మరో 3 పీహెచ్‌సీలు కలిపి మొత్తం 54 పీహెచ్‌సీల నిర్వహణకు  వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల మంజూరీ లో జాప్యం జరిగింది. మహబూ బ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లోని ఒక్కో పీహెచ్‌సీలో మాత్రమే వారంలో కొన్ని రోజు లు సేవలందిస్తున్నారు. ఇతర పీహెచ్‌సీ లోని వైద్యులకు అదనపు బాధ్యతలు అప్పగించి ఇక్కడ సేవలు కొనసాగిస్తున్నా రు.

ఆస్పత్రిని నిర్మించి వదిలేసిండ్లు. ప్రారంభించిన రోజే అందరు వచ్చిండ్లు. ఆ తర్వాత ఎవరు రాలే. బిల్డింగ్‌ మొత్తం పడావు పడిపోతాంది.
– కందుల నర్సయ్య, సిద్ధాపురం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

ఎక్కువ మంది గిరిజనులు ఉన్న ప్రాంతం మాది. పీహెచ్‌సీని ప్రారంభిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ప్రజాప్ర తినిధులు చొరవ చూపి సేవలు ప్రారంభించాలి. మా కష్టాల ను తీర్చాలి   
 – ఆంగోతు మంగ్తానాయక్, అడవిదేవులపల్లి

కడ్తాల్‌ మండలం మైసిగండిలో ఆస్పత్రిని ప్రారంభిం చారు. వైద్య సేవలు మాత్రం అందించడం లేదు. ప్రభుత్వం కొత్తగా డాక్టర్లను నియమించలేదట. ఈ విషయంపై పలుసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవడంలేదు.
– శ్రీనివాస్‌గౌడ్, మైసిగండి, రంగారెడ్డి జిల్లా.

వైద్యం దూరమైతాంది
ఏ చిన్న సమస్య వచ్చినా వరంగల్‌కు పోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఆస్పత్రిని నిర్మించినందుకు సంతోషమే. అయితే డాక్టర్లు లేరు. ఎవరు లేరు. ఆస్పత్రిని నిర్మించినా మళ్లీ పాత సమస్యలే.
– బొక్క రాజు, సిద్ధాపురం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

మరిన్ని వార్తలు