క్యాబ్‌ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్‌

26 May, 2020 15:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం హైకోర్టులో పిల్‌ దాఖలైంది. క్యాబ్‌ డ్రైవర్ల తరుపున న్యాయవాది రాపోలు భాస్కర్‌ పిల్‌ను వేశారు. పిటిషనర్‌ తరుపు వాదనలను సీనియర్‌ అడ్వకేట్‌ మాచర్ల రంగయ్య వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల క్యాబ్‌ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్‌ కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక క్యాబ్‌ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికి ఈఎంఐ కట్టాలని బ్యాంక్‌లు ఒత్తిడి తెస్తున్నాయని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈఎంఐలు కట్టలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు జూన్‌ 5న క్యాబ్‌ డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌5కు కోర్టు వాయిదా వేసింది. (అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు)

మరిన్ని వార్తలు