ప్రగతి నివేదన సభకు వస్తున్నారా..?

1 Sep, 2018 08:50 IST|Sakshi

రహదారి భద్రత నిబంధనలు పాటించడం తప్పనిసరి

ప్రాంతీయ రవాణా అధికారి పాపారావు సూచనలు

సాక్షి, సిటీబ్యూరో: ప్రగతినివేదన సభకు వచ్చే వాహనాలు కచ్చితమైన రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, డ్రైవర్లు  క్రమశిక్షణతో వాహనాలు నడపాలని ప్రాంతీయ రవాణా అధికారి, ఆర్టీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చీఫ్‌ పాపారావు   పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రగతి నివేదన సభకు తరలి రానున్న వాహనాల నిర్వహణను  పర్యవేక్షిస్తున్న ఆయన  డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌టేక్‌లకు స్థానం ఇవ్వరాదని కోరారు. లైన్‌ విధానాన్ని పాటించాలి. జనాన్ని  సురక్షితంగా తీసుకొచ్చి  తిరిగి  అంతే సురక్షితంగా తమ ఇళ్ల వద్దకు చేర్చవలసిన బాధ్యత  డ్రైవర్లపైనే ఉంది. ఇందుకోసం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి’ అని అన్నారు. డ్రైవర్లు  ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగవద్దని హెచ్చరించారు. మరోవైపు సభకు తరలి వచ్చే వాహనాల రాకపోకలు, డ్రైవర్లపై నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. జిల్లాలవారీగా కేటాయించిన  పార్కింగ్‌ స్థలాల్లోనే వాహనాలను నిలపాలి. రోడ్డు భద్రతపైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు