డ్రగ్స్‌ ఏవి?.. ఎలుకలు తినేశాయి..!

1 Sep, 2018 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ : మన దేశంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాలు అంటే ముందగా గుర్తుకు వచ్చేది వైద్యం విభాగం, న్యాయ విభాగం. డాక్టర్ల సంఖ్య, అలానే పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే అది విచారణకు రావాలంటే ఏళ్లు పడుతుంది. ఆ లోపు జీవితాలు, సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు అధికం.  ఇందుకు ఉదాహరణగా నిలిచారు ఢిల్లీ పోలీసులు. కొన్నేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు పోలీసులు ఆ డ్రగ్స్‌ని ఎలుకలు తినేశాయంటూ వింత సమాధానం ఇచ్చారు.

వివరాల ప్రకారం.. మూడు, నాలుగేళ్ల క్రితం ఫైల్‌ అయిన డ్రగ్స్‌ కేసులను విచారించడానికి సుప్రీంకోర్టు, జస్టిస్‌ మదన్‌ బీ. లోకూర్‌, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను కోర్టుకు చూపించాల్సిందిగా ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అందుకు పోలీసులు అప్పుడు  స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ప్రస్తుతం తమ వద్ద లేవని.. వాటిని ఎలుకలు తినేశాయంటూ వింత సమాధానం ఇవ్వడంతో విస్తుపోవడం న్యాయమూర్తుల వంతయ్యింది. పోలీస్‌ స్టేషన్‌లో డ్రగ్స్‌ భద్రపరిచిన గదుల్లో ఎలుకలు ఉన్నాయని, అవే వాటిని తినేశాయని పోలీసులు చెప్పుకొచ్చారు.

గతంలో బిహార్‌ పోలీసులు కూడా ఇదే తరహా సమాధానం చెప్పారు. గతేడాది బిహార్‌లో కూడా పోలీసులు ఇలాంటి విచిత్రమైన సమాధానమే చెప్పారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న మద్యాన్నంతా ఎలుకలు తాగుతున్నాయన్నారు. దాదాపు 9లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెప్పారు.

మరిన్ని వార్తలు