రైతుపై పోలీసుల దాడి?

9 Nov, 2017 11:48 IST|Sakshi

నడుచుకుంటూ వెళ్తుండగా కొట్టి నగదు దోపిడీ  

ఎస్సైకి ఫిర్యాదు చేసిన బాధితుడు 

తమకు సంబంధం లేదంటున్న కానిస్టేబుళ్లు  

నందిగామ(షాద్‌నగర్‌): నడుచుకుంటూ వెళ్తున్న  రైతు దారి దోపిడీకి గురయ్యాడు... దళిత రైతును చితకబాది అతని వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. దెబ్బలు తగిలిన రైతు చర్మం పూర్తిగా కమిలిపోయింది. దాడి చేసింది పోలీసులేనని బాధితుడు అంటుంటే... తమకు దాడి చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సప్పగూడ రోడ్డులో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా  బుధవారం ఉదయం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..  

నడుచుకుంటూ వెళ్తుండగా.. 
మండల పరిధిలోని నర్సప్పగూడ గ్రామానికి చెందిన దళిత రైతు కొంగరి రాములు మంగళవారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో నందిగామ నుండి నర్సప్పగూడకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు గ్రామ శివారులోని వాగు వద్దకు చేరుకోగానే ఎదురుగా గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రైతు కొంగరి రాములును అడ్డగించి చితకబాదారు. రైతు జేబులో ఉన్న సుమారు రెండు వేల రూపాయలను కూడా వారు దోచుకున్నట్లు బాధితుడు వాపోతున్నాడు. అయితే బాధిత రైతును చితకబాదడంతో అతని చర్మం పూర్తిగా కమిలిపోయింది. దీంతో అతడు తన భార్య రాములమ్మతో కలిసి నందిగామ పోలీస్‌ స్టేషన్‌కు బుధవారం ఉదయం చేరుకొని గాయాలను ఎస్సై హరిప్రసాద్‌రెడ్డికి చూపిస్తూ ఫిర్యాదు చేశాడు. 

పోలీసులే దాడి చేశారని ఫిర్యాదు 
తనపై ఇద్దరు కానిస్టేబుళ్లు దాడి చేశారని, తన వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదును కూడా వారే దొంగిలించారని సదరు బాధితుడి బార్య ఎస్‌ఐకి ఇచ్చిన  ఫిర్యాదులో పేర్కొనాడు. బూతుమాటలు తిడుతూ తనౖ  భర్తపై దాడి చేసి దౌర్జన్యం చేసిన కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ఇదీ కొసమెరుపు 
రైతు కొంగర రాములు మంగళవారం షాద్‌నగర్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో నందిగామలో బస్సు దిగి స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ పరిశ్రమ వద్ద వాచ్‌మెన్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రాములును బెదిరించి అక్కడి నుండి పంపించినట్లు సమాచారం. కాగా  నర్సప్పగూడ గ్రామంలో జరిగిన విందులో పాల్గొని వస్తున్న ఆ కానిస్టేబుళ్లే గ్రామ శివారులో ఉన్న వాగు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న రాములును చితక్కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఎస్సై  
ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఆరోపణ మేరకు కానిస్టేబుళ్లపై విచారణ చేపట్టి వాస్తవమని తేలితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. కొంగర రాములును కానిస్టేబుళ్లు కొట్టాల్సిన పనేముందని ఎస్సై అన్నారు.  

అసలు దాడి చేసిందెవరు..? 
కొంగర రాములుపై దాడి చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానిపై భిన్నవాదనలు ఉన్నాయి. తనను దాడి చేసింది పోలీసు కానిస్టేబుళ్లేనని బాధిత రైతు చెప్పడమే కాకుండా ఎస్సైకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఎస్సై కూడా తమ కానిస్టేబుళ్లకు కొట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దళిత రైతుపై దాడి చేసిన ఘటన మిస్టరీగా మారింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితేనే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు