జిల్లా కోర్టు ఎదురుగా లాఠీతో వీరంగం

2 Jul, 2019 10:39 IST|Sakshi
ఘర్షణ పడుతున్న ఇరువర్గాలు 

సాక్షి, ఖమ్మం : కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగడంతోపాటు చేయి చేసుకున్నారన్న సమాచారం ఆ కానిస్టేబుల్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూనిఫామ్‌లో ఉన్నానన్న విషయాన్ని సైతం మర్చిపోయి సాక్షాత్తు జిల్లా కోర్టు ఎదురుగా లాఠీతో వీరంగం సృష్టించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక టూటౌన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారితో గంగాభవానికి గత సంవత్సరం వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ కోర్టులో కేసు వేసింది. అలాగే తనకు నెలవారీ మెయింటెనెన్స్‌ ఇవ్వాలంటూ మరో కేసు  వేసింది. ఈ కేసుల విచారణ కోసం గంగాభవానితోపాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు.. విజయభాస్కరాచారి కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు.

ఆ సమయంలో గంగాభవాని కుటుంబ సభ్యులకు, విజయ భాస్కరాచారి కుటుంబ సభ్యులకు మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది.  ఒకరిని ఒకరు దూషించుకోవడంతో పాటు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు హుటాహుటిన కోర్టు వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగిన వారిపై లాఠీ ఝుళిపించడం.. దీంతో ఒకరికి గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  తమపై హెడ్‌కానిస్టేబుల్‌ దాడి చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. 

కేసు పూర్వాపరాలిలా.. 
ఖమ్మం రెండో పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ తవుడోజు వెంకటేశ్వర్లు, అతని భార్య, కుమారుడు విజయభాస్కరాచారిపై కోర్టు వద్ద జరిగిన ఘర్షణ సంఘటనపై స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.   వెంకటేశ్వర్లు కుమారుడైన విజయభాస్కరాచారికి, నగరంలోని వీడీవోస్‌ కాలనీలో నివాసం ఉంటున్న గంగాభవానితో 2018, మే 6న టీఎన్‌జీవోస్‌ కాలనీలో వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ.30 లక్షలు కట్నంగా ఇచ్చినట్లు.. కొంతకాలం బాగానే చూసుకున్నారని, ఆ తర్వాత మామ, అత్త, కుమారుడు అదనపు కట్నంతోపాటు 2 ఎకరాల పొలం రిజిస్టర్‌ చేయాలని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని ఖమ్మం కుటుంబ న్యాయస్థానంలో మెయింటెనెన్స్‌ కేసు, అదే కోర్టులో గృహహింస చట్టం కింది డీవీసీ కేసులను వేశారు.

ఆమె భర్త విజయ భాస్కరాచారి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులు సోమవారం ఉండటంతో ఇరు వర్గాలు వాయిదాకు హాజరయ్యేందుకు న్యాయస్థానానికి రాగా.. కోర్టు సమీపంలో ఇరువురూ ఘర్షణ పడి బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, అతని భార్య, కుమారుడిపై బాధితులు ఫిర్యాదుచేయగా టూటౌన్‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు