పెళ్లై 11 ఏళ్లు, పిల్లలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం

25 Nov, 2023 11:29 IST|Sakshi
రాజారెడ్డి (పాత చిత్రం)

కాకినాడ రూరల్‌: రమణయ్యపేట ఆర్టీసీ కాలనీకి చెందిన వల్లింకల అప్పల రాజారెడ్డి (39) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సర్పవరం పోలీసుల కథనం ప్రకారం.. ఆర్టీసీ కాలనీ రోడ్డు నంబర్‌–1లో ఉంటున్న అప్పల రాజారెడ్డి గురువారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. మృతుడు ఆలమూరు మండలంలో ఇరిగేషన్‌ ఏఈఈగా పని చేస్తున్నాడు. భార్య సుధారాణి కాకినాడలో ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్‌ హోదాలో పని చేస్తున్నారు.

వీరికి వివాహమై సుమారు 11 ఏళ్లు అవుతోంది. పిల్లలు లేకపోవడంతో సుమారు నాలుగేళ్ల పాపను దత్తత తీసుకుని, పెంచుకుంటున్నారు. అప్పల రాజారెడ్డి ఉరికి వేలాడటం చూసి, భయపడిన ఆ పాప ఏడవడాన్ని సమీపంలోనే ఉంటున్న అతడి తండ్రి సత్యనారాయణ అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి గమనించి, బ్యాంక్‌లో విధుల్లో ఉన్న అప్పల రాజారెడ్డి భార్య సుధారాణికి సమాచారం అందించారు. అందరూ కలసి అప్పల రాజారెడ్డిని కిందకు దించి, సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. కొడుకు మృతిపై తండ్రి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సెల్‌ ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ అవలేదని, అది ఓపెన్‌ అయితే అప్పల రాజారెడ్డి మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంటుందని సీఐ మురళీకృష్ణ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు