ఇక ‘వీడియో’ పెట్రోలింగ్

5 May, 2015 00:44 IST|Sakshi

- తస్మాత్ జాగ్రత్త! నిఘా నేరుగా మీ వద్దకే..
- 24 గంటల పాటు పహారా
- కరీంనగర్‌లో ప్రారంభించిన ఎస్పీ
- రెండో దశలో గోదావరిఖనిలో..
కరీంనగర్ క్రైం:
ఆరుబయట మద్యం తాగడం, ఈవ్‌టీజింగ్, ఆందోళనలు, అల్లరిమూకల వేధింపులు, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్  ఇబ్బందులు... ఇవే కాదు ఎక్కడేం జరిగినా ఇక పోలీసుల కెమెరాలో నిక్షిప్తం కానున్నారుు. వీడియో కెమెరాతో కూడిన అత్యాధునికమైన పెట్రోలింగ్ వాహనాన్ని సోమవారం ఎస్పీ శివకుమార్ కరీంనగర్‌లో ప్రారంభించారు. పెట్రోలింగ్ వాహనంలో ఏర్పాటు చేసిన వీడియో కెమెరా అన్ని సంఘటనలను రికార్డు చేసి కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో విజయవంతమైన ఈ విధానాన్ని మొదటిసారిగా జిల్లా కేంద్రంలో ప్రవేశపెట్టారు.

రెండో దశలో ఇలాంటి పెట్రోలింగ్ వాహనాన్ని గోదావరిఖనిలో ప్రారంభిస్తామని ఎస్పీ తెలిపారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే  డయల్ 100కు గాని, వాట్స్ యూప్ నంబర్ 7093101101కు సమాచారం అందించాలని సూచించారు. కాగా.. ఈ పెట్రోలింగ్ వాహనానికి నిత్యం ఒక ఎస్సై ఇన్‌చార్జిగా వ్యహరిస్తారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి షిప్ట్ పద్ధతిలో 24 గంటల పాటు పెట్రోలింగ్ చేస్తుంది. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటే సంఘటన స్థలానికి చేరుకుని వీడియో రికార్డు చేయడంతో పాటు ఫొటోలు తీస్తుంది. అక్కడ సంఘటనను నియంత్రించడానికి పోలీసులు చర్యలు చేపడతారు.

నగర శివారుల్లో మద్యం సేవిస్తున్న వారి ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి అక్కడ్కికడే జరిమానా విధించడం లేదా వారిని కోర్టులో ప్రవేశపెడుతారు. దీనికి సాక్ష్యంగా వాహనంలో రికార్డు అయిన వీడియోను కోర్టుకు సమర్పిస్తారు. ఈ వీడియోలో నిక్షిప్తమైన అన్ని కేసుల్లోనూ కోర్టుకు ఆధారాలను సమర్పిస్తారు. ఇప్పటికే పోలీసులకు అందించిన వాహనాలపై ప్రత్యేకమైన లైట్లు, మైక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, గోదావరిఖని డీఎస్పీలు జె.రామారావు, ఎస్.మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ కోటేశ్వర్‌రావు, కరీంనగర్ వన్, టు, త్రీ రూరల్, ట్రాఫిక్, తిమ్మాపూర్ సీఐలు విజయసారథి, హరిప్రసాద్, సదానందం, నరేందర్, మహేశ్‌గౌడ్, వెంకటరమణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు