చలించిన.. పోలీస్

5 Jun, 2015 23:53 IST|Sakshi

మునుగోడు : మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన కొంపల్లి చంద్రయ్యకు ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఆ కుంటుంబ కన్నీటిగాథను తెలుసుకుని ‘‘పేద కుటుంబానికి.. పెద్దకష్టం’’ శీర్షికన ఈ నెల 1వ తేదీన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీంతో తమకు తోచినంత కొందరు ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని పత్రికలో చదివి మునుగోడు ఎస్‌ఐ బి.డానియేల్‌కుమార్, ఇతర సిబ్బంది కూడా చలించిపోయారు.

ఆ కుటుంబానికి తమ వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. తాము సహాయ సహకారాలు అందిస్తూనే మండలవాసులను కూడా భాగస్వామ్యం చేయాలని తలంచారు. దీనిలో భాగంగానే శుక్రవారం ‘‘కిడ్నీ బాధితుడిని సహాయం అందిద్దాం.. మానవత్వాన్ని చాటుకుందాం’’ అనే బ్యానర్‌తో ఎస్‌ఐ డానియల్‌కుమార్, తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలో విరాళాలు సేకరించారు. మూడు గంటలకు పైగా ఖాకీలు మండల కేంద్రంలోని దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాన్య ప్రజల వద్దకు వెళ్లి కిడ్నీ బాధితుడికి సహాయం చేసి అండగా నిలవండి అంటూ అభ్యర్థించారు.

సేకరించిన విరాళాలను త్వరలోనే బాధిత కుటుంబానికి అందివ్వనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులు పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు నడుం బిగించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ రామయ్య,హెడ్‌కానిస్టేబుల్ ఖాసీం, శౌరీలు, కానిస్టేబుళ్లు జ్యోతి, లింగస్వామి, సత్యనారయణ, జానకిరాములు, సత్యం, వెంకన్న, యాదగిరి, మురళి, సైదులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు