మేమింతే..!  

13 Feb, 2019 07:28 IST|Sakshi
సామన్‌ చెరువులో మట్టి తవ్వుతున్న పొక్లెయినర్‌  మట్టి తవ్వడంతో చెరువులో ఏర్పడిన భారీ గుంతలు

మాగనూర్‌(మక్తల్‌): మహబూబ్‌నగర్‌ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు త్రిబుల్‌ లేన్‌ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి.. ఇందులో మహబూబ్‌నగర్‌ నుంచి మరికల్‌ వరకు పనులు పూర్తికాగా.. ప్రస్తుతం అక్కడి నుంచి కర్ణాటక శివారు శక్తినగర్‌ వరకు రోడ్డు పనులను మరో కాంట్రాక్టర్‌ చేపడుతున్నాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ రోడ్డు పనుల కోసమంటూ చెరువు మట్టిని తరలిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫీట్ల లోతు వరకు మట్టిని ఇష్టారాజ్యంగా పొక్లెయినర్లతో తవ్వుతుండడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ పనుల కోసమే అయినా.. అదే ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉపయోగపడే చెరువు నుంచి మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదంతా మాగనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం తామెవరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.

పొలాలకు దారి 
మాగనూరు మండల కేంద్రంలోని మెన్‌ రోడ్డు పక్కనే సామన్‌చెరువు ఉంటుంది. ఈ చెరువు నీరు ఆయకట్టు రైతులు పొలాలు పండించుకునేందుకు, వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాకుండా ఈ చెరువు మీదుగా అటు వైపు ఉన్న పొలాల్లోకి దాదాపు యాభై మంది రైతులు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ జేసీబీలు, పొక్లెయినర్లు పెట్టి మరీ ఏకంగా 20ఫీట్ల లోతు వరకు తవ్వి మట్టి తరలిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదాలకు ఆస్కారముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం వెళ్లిన పశువులు కానీ మనుషులు కానీ అందులో పడితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని చెబుతున్నారు. 

అనుమతులు లేవు.. 
ప్రభుత్వ భూముల్లోని చెట్లను కొట్టేందుకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇక మట్టి తవ్వాలన్నా, తరలించాలన్నా మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మించాలన్నా నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌గా అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాగనూర్‌ మండలంలో మాత్రం చాలామంది తమ పొలాల్లో మట్టి తరలించుకునేందుకు రైల్వేలైన్‌ కాంట్రాక్టర్, రోడ్డు పనుల కాంట్రాక్టర్‌కు అవకాశహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్‌ తమనెవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో ఏకంగా చెరువుపై కన్నేశాడు. ఇక చెరువు నుంచి సైతం 20 ఫీట్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టడం అధికారుల దృష్టికి వచ్చే అవకాశమున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది.

నిబంధనలకు తిలోదకాలు 
మాగనూరు నుంచి కర్ణాటక శివారు వరకు రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పనుల్లో మొదటి నుంచి నిబంధనలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో ఓ పక్క వాహనాలను వెళ్లుటకు అవకాశం కల్పించి మరో పక్క రోడ్డు నిర్మించాలి. కానీ అందుకు విరుద్ధంగా కాం ట్రాక్టర్‌ వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఒకేసారి మొత్తం ఉన్న రోడ్డును త్రవ్వి కొత్త రోడ్డు ను నిర్మిస్తుండడం మూలంగా వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలను గురై మృత్యువాత పడుతున్నారు.

అలాగే రోడ్డుకు కల్వర్టులు నిర్మిస్తున్న సమయంలో ముందుగా హెచ్చరిక బోర్డులు కానీ స్పీడ్‌ బ్రేకర్లు కానీ నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే మా ర్గంలో ఇటీవల ఓ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు, అయినప్పటికీ రోడ్డు పను ల్లో నిబంధనలు పాటించని అంశాన్ని పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు మట్టి తరలింపుపై కూడా స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సామన్‌చెరువు నుంచి మట్టి తరలిస్తున్న అంశంపై స్థానికులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు