జనాభా నియంత్రణ అందరి బాధ్యత

12 Jul, 2014 01:41 IST|Sakshi

 ఆదిలాబాద్ టౌన్ : జనాభా నియంత్రణ మన అందరి బాధ్యత అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బసవేశ్వరి అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా పెరగడం ద్వారా పేదరికం పెరుగుతుందని తెలిపారు.

జనాభా నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. జనాభా పెరిగితే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనాభా పెరిగితే కనీస సౌకర్యాలు కరువవుతాయని, పరిమిత కుటుంబం-అపరిమిత సంతోషం అన్న నినాదంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆడ శిశువులపై వివక్ష చూపించొద్దని, భ్రూణహత్య చట్టరీత్యా నేరమని అన్నారు.

అంతకుముందు పట్టణంలోని వీధుల గుండా అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, ఒకే కాన్పుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న దంపతులకు ప్రోత్సాహాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మనీష, డీఐవో చందు, అదనపు డీఎంహెచ్‌వో జలపతి నాయక్, మలేరియా నివారణ అధికారి అల్హం రవి, జబార్ కో-ఆర్డినేటర్ భీష్మ, ఆదిలాబాద్ జెడ్పీటీసీ అశోక్, ఎస్పీహెచ్‌ఎన్‌వో డాక్టర్ వైసీ.శ్రీనివాస్, రిమ్స్ డెరైక్టర్ శశిధర్, ఐడీసీఎస్ పీడీ మీరా బెనర్జీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు