జరిమానాలకు జంకుతున్న వాహనదారులు

17 Oct, 2019 10:20 IST|Sakshi

కొత్త వాహనం చట్టంతో తగ్గుతున్న కేసుల సంఖ్య

సాక్షి, వరంగల్‌ క్రైం: వాహనంతో రోడ్డెక్కాలంటే వంద ప్రశ్నలు... జరిమానా ఏ రూపంలో పొంచి ఉందో తెలియని అయోమయ పరిస్థితి.. గతంలో మాదిరిగా వాహనాలను ఆపి జరిమానా విధించడం లేదు.. మనం వెళ్తుంటే మనకు తెలియకుండా ఫొటో తీసి ఆన్‌లైన్‌లో జరిమానా చలాన్‌ పంపిస్తున్నారు.. దీనికి తోడు నూతన వాహనం చట్టం, ట్రాఫిక్‌ జరిమానాలపై వాట్సప్‌ గ్రూప్‌ల్లో భయపెట్టే విధంగా వైరల్‌ అయిన వీడియోలు... ఫలితంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనంతో బయలుదేరాలంటేనే ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి! ఇలా కారణాలేమైతే ఏమిటి కానీ కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గడం వెనుక వాహనదారుల్లో పెరిగిన జాగ్రత్తలు.. అధికారుల అవగాహన కార్యక్రమాలనే చెప్పాలి.

తగ్గుముఖం పడుతున్న కేసులు
ట్రాఫిక్‌ నిబంధనలను కఠినతరం చేయడం, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించడం, భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన మార్పుతో ట్రాఫిక్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ లేకుంటే బయటకు పోవడానికి భయపడుతున్నారు. అలాగే, ఎక్కడ వాహనం ఆపాలన్నా నో పార్కింగ్‌ బోర్డు ఉందా అని ఒకటికి, రెండు సార్లు ఆలోచిస్తున్నారు.. అలాగే, ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు.

గ్రీన్‌ లైట్‌ పడిన తర్వాతే బండిని ముందుకు దూకిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో వాహనదారులు జరిమానాల బాధ నుంచి తప్పుకుంటున్నారు. ఫలితంగా వాహనదారులకే కాకుండా ఎదుటి వారు కూడా ప్రమాదాల బారి నుంచి బయటపడుతున్నారు.

ఉల్లంఘన జరిగితే అంతే..
సిగ్నల్‌ జంప్, ట్రిపుల్‌ రైడింగ్, హెల్మెట్‌ లేకుండా ప్రయాణం, నో పార్కింగ్, రాంగు రూట్‌ ఇలా అనేక అంశాల్లో ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించి వాటిని నేరుగా ఇంటికే చలాన్‌ పంపిస్తున్నారు. దీంతో లబోదిబోమంటున్న వాహనదారులు.. తాము నిబంధనలను ఎక్కడ ఉల్లాంఘించామో తెలియజేసేలా సమ యం, తేది, వాహనం ఫొటో జత చేస్తుండడంతో కిక్కురుమనలేని పరిస్థితి ఎదురవుతోంది.

ఇక ట్రాఫిక్‌ అధికారులు వాహనాల తనిఖీ సమయంలో జరిమానా విధించే పెండింగ్‌ చలాన్లు ఉన్నాయా అని కూడా పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఎప్పటిప్పుడు జరిమానా చెల్లించక తప్పడం లేదు. వీటన్నింటినీ అధిగమించేందుకు నిబంధనలు పాటించడమే మార్గమని భావిస్తుండడంతో కేసుల సంఖ్య తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు