అలయన్స్‌ వర్శిటీ మాజీ వీసీ పాశవిక హత్య

17 Oct, 2019 10:21 IST|Sakshi

సాక్షి, బెంగళూరు :  బెంగళూరు అలయన్స్‌ వర్శిటీ విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ అయ్యప్ప దొరె(53)ను దుండగులు దారణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆర్‌టీనగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. విజయపుర జిల్లాకు చెందిన ఆయన ఆర్‌టీ నగరలో 17ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అనేకల్‌ సమీపంలోని అలయన్స్‌ వర్శిటీలో ఎనిమిదేళ్లపాటు వైస్‌ చాన్సలర్స్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో అయ్యప్ప ఇంటికి 50 మీటర్ల దూరంలో కాపు కాచిన దుండగులు అయనను అడ్డగించి మారాణాయుధాలతో విచక్షణరహితంగా నరికి చంపారు. కాగా వాకింగ్‌కు వెళ్లిన అయ్యప్ప ఎంతసేపటికీ ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య భావన, కుటుంబసభ్యులు వెదకటం ప్రారంభించగా.. హెచ్‌ఎంటీ గ్రౌండ్‌ వద్ద  రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆర్‌టీ నగర పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం అంబేడ్కర్‌ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నిందితుల అచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. 

రాజకీయ పార్టీని ప్రారంభించిన అయ్యప్పదొరె
అయ్యప్పదొరె ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించి ముద్దేబీహళ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అంతేగాకుండా భూ వివాదానికి సంబంధించి అలయన్స్‌ వర్శిటీపై అయన కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. కాగా లింగాయత్‌లకులకు ప్రత్యేక ధర్మం కావాలని అయ్యప్ప పోరాటం చేశారు. అదే విధంగా శివరామ కారంత డినోటీపీకేషన్‌ కేసుకు సంబంధించి గతంలో సీఎంగా యడియూరప్ప ఉన్నప్పడు అయనపై ఏసీబీకీ ఫిర్యాదు చేశారు. ఇవేకాకుండా అనేక అంశాలపై కూడా అయన పోరాటం చేశారు. ఇక డీసీపీ శశికుమార్‌... అయప్పదొరె భార్య భవన నుంచి కొంత సమాచారం సేకరించారు. భూ వివాదానికి సంబంధించి కోర్టులో నడుస్తున్న కేసు వివరాలు తెలుసుకున్నారు. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు అయ్యప్ప హత్య కేసును విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు