లోడు బాదుడు

7 Jun, 2019 09:24 IST|Sakshi

ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తే అదనపు చార్జీలు  

చెల్లించాలంటున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ  

ఏడాది సగటు ఆధారంగా వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు  

కనెక్షన్ల క్రమబద్ధీకరణకు అవకాశం

స్వచ్ఛందంగా ముందుకొస్తే 50 శాతం రాయితీ  

సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్‌ కనెక్షన్ల సమయంలో తీసుకున్న ఒప్పంద లోడు కంటే ఎక్కువగా విద్యుత్‌ వాడే వినియోగదారులకు అదనపు భారం తప్పడం లేదు. కనెక్షన్‌ జారీ సమయంలో తీసుకున్న ఒప్పంద లోడు కంటే ప్రస్తుతం చాలా మంది ఎక్కువ విద్యుత్‌ వాడుతున్నారు. గత 12 నెలల విద్యుత్‌ వినియోగాన్ని కనెక్షన్ల వారీగా   గుర్తించిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ... ఆ మేరకు అదనపు లోడు చార్జీలను చెల్లించాలని ఆయా వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపిస్తోంది. అదే విధంగా అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి డిపాజిట్‌ బిల్లుపై 50శాతం రాయితీని ప్రకటించింది. దక్షిణ తెలంగాణ పరిధిలో 70లక్షలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్‌లోనే 50లక్షలకు పైగా ఉన్నాయి. గ్రేటర్‌లో చాలామంది ఏళ్ల క్రితమే విద్యుత్‌ కనెక్షన్లు పొందారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా చాలామంది ఒక కిలోవాట్‌ మాత్రమే తీసుకున్నారు.

ఆ తర్వాత విలాసవంతమైన జీవితం కోసం మార్కెట్‌లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చిన విద్యుత్‌ పరికరాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, కూలర్, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, వాషింగ్‌మెషిన్, ఏసీ, మిక్సీ, వాటర్‌ హీటర్, ఐరన్‌ బాక్స్, బోరు మోటార్‌.. ఇలా చాలా రకాల వస్తువులు సర్వసాధారణమయ్యాయి. దీంతో కనెక్షన్‌ జారీ సమయంలో తీసుకున్న లోడు కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. కేటాయించిన లోడు కంటే ఎక్కువ విద్యుతు వాడుతుండడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతోంది. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గుల సమస్యలతో పాటు ఫీజులు పోవడం, డీటీఆర్‌లో కాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఏ ఇంటికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్‌ అవసరమో ముందే గుర్తిస్తే... ఆ మేరకు డిస్ట్రిబ్యూషన్‌ లైన్లను పటిష్టపరిచే అవకాశం ఉన్నట్లు డిస్కం భావిస్తోంది. ఆయా కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు