పవర్.. దెబ్బ

10 Jul, 2014 01:11 IST|Sakshi
పవర్.. దెబ్బ

భువనగిరి :అప్రకటిత విద్యుత్ కోతతో పవర్‌లూం పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గంటల తరబడి విధిస్తున్న విద్యుత్ కోతలతో పవర్‌లూంను నమ్ముకుని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, యజమానులు, మాస్టర్ వీవర్లు భవిష్యత్‌పై ఆందోళనతో ఉన్నారు. ఒక్కో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గంట కూడా కరెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, రాజాపేట, రఘునాథపురం, గౌరాయపల్లి, కొలనుపాక, నకిరేకల్, నల్లగొండ, చర్లపల్లి, ఈదులూరు లాంటి ప్రాంతాల్లో పవర్‌లూం(మరమగ్గాలు) పరిశ్రమపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
 
  ప్రస్తుతం విద్యుత్ కోత పుణ్యమాని వారు దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయం తర్వాత కుటీర పరిశ్రమల్లో అధికభాగం కుటుంబాలకు ఉపాధి కల్పించే చేనేత మనుగడ గగనమైన తరుణంలో పవర్‌లూమ్స్ కులమతాలకు అతీతంగా ఉపాధిని కల్పిస్తున్నాయి. పెరిగిన విద్యుత్ బిల్లులు, కరెంటుకోత, జనరేటర్ ఏర్పాటు చేసుకునే ఆర్థిక సామర్థ్యం లేకపోవడంతో మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్ డిజైన్లతో బట్టను తయారు చేయడం విదేశాల నుంచి విపరీతంగా రకరకాల వస్త్రాలు దిగుమతి కావడంతో స్థానిక మార్కెట్‌లో తయారైన హైండ్లూమ్ వస్త్రలకు గిరాకి తగ్గిపోయింది.  
 
 పనిలేక పస్తులుండే పరిస్థితి
 కరెంట్ కోతలు అమలు జరుగుతుండడంతో కార్మికులు పనిలేక పస్తులుండే పరిస్థితి నెలకొంది. 24 గంటల కరెంట్ కోసం పవర్‌లూం గ్రామాలకు ప్రత్యేక పీడర్‌లను ఏర్పాటు చేసినా ఇటీవల ఎక్కువైన విద్యుత్ కోతలతో పడరాని పాట్లు పడుతున్నారు. ఒక జోడి(రెండు మరమగ్గాలు) నిరంతరాయంగా 8 గంటలు నడిస్తే రోజుకు రూ.250 నుంచి రూ.300 కూలి గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రస్తుతం పగటి పూట రెండు గంటలు కూడా కరెంట్ ఉండకపోవడంతో రూ.50 కూడా రావడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. విద్యుత్ సమస్యను తీర్చాలని కోరుతూ ఇటీవల రాజాపేట మండలం పొట్టిమర్రి సబ్ స్టేషన్ వద్ద పవర్‌లూం కార్మికులు ఆందోళన కూడా చేశారు. కరెంట్ లేకపోవడంతో ఇంటిల్లిపాది పనులు లేక పస్తుండాల్సిన పరిస్థితి ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైన పవర్‌లూం పరిశ్రమను కాపాడడానికి గతంలో మాదిరిగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు