‘పవర్’ ప్రణాళికలు

8 Jan, 2015 02:15 IST|Sakshi
  • కొత్త విద్యుత్ ప్లాంట్లపై తెలంగాణ కసరత్తు.. నల్లగొండలో 6,800 మెగావాట్ల ప్లాంట్
  •  అంచనా వ్యయం 40 వేల కోట్లు
  • సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే జెన్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెన్‌కో ఇంజనీరింగ్ వర్గాలు కొత్త నివేదికలు సిద్ధం చేశాయి. తాజా మార్పుల ప్రకారం నల్లగొండ జిల్లాలోనే మొత్తం 6,800 మెగావాట్ల సామర్థ్యంతో మెగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీఎస్ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు తెలిపారు.

    రెండు 600 మెగావాట్ల యూనిట్లు, ఏడు 800 మెగావాట్ల యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, దిలావర్‌పూర్ గ్రామాల పరిధిలో మొత్తం 11 వేల ఎకరాల భూములు గుర్తించారు. ఇవన్నీ అటవీ భూములు కావటంతో ప్రత్యామ్నాయంగా అంతే మొత్తం భూములు అటవీ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎండీ తెలిపారు.

    అందులో రూ.36 వేల కోట్లు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని.. మిగతా రూ.4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీల ద్వారా లేదా ఇతరత్రా వనరుల ద్వారా సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం హామీ ఇచ్చిన ఎన్‌టీపీసీ 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రెండు యూనిట్లు  (2800  మెగావాట్లు) రామగుండంలో ప్రస్తుతమున్న ప్లాంటు పరిధిలోనే నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
     

మరిన్ని వార్తలు