సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకం

7 Oct, 2018 04:24 IST|Sakshi
సైన్స్‌ ఫెస్టివల్‌కు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, యూపీ గవర్నర్‌ రాంనాయక్, సీఎం యోగి

రేపటి తరం టెక్నాలజీలను అందుకోండి

మౌలిక శాస్త్ర పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వండి

శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: యుగాలుగా గణితం మొదలుకొని లోహ శాస్త్రం వరకూ అనేక శాస్త్ర రంగాలపై తనదైన ముద్ర వేసిన భారతదేశం.. రేపటి తరం టెక్నాలజీలను అం దుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విజ్ఞానాన్ని సృష్టించే సంస్థలు కృషి, భాగస్వామ్యం కూడా అత్యవసరమని అన్నారు. శనివారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఐఐఎస్‌ఎఫ్‌ సమావేశాలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల కుంభమేళాగా అభివర్ణించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన టీకా కార్యక్రమానికి శీతలీకరణ పరిజ్ఞానం సాయపడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో ఎంత పురోగతి సాధిస్తున్నా మౌలిక శాస్త్ర పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందు లో 100 గిగావాట్ల వరకూ ఉండే సౌరశక్తి సద్వినియోగానికి కూడా వినూత్న టెక్నాలజీ సాయపడుతోందని వెల్లడించారు.  

మహిళా ప్రాతినిధ్యం పెరగాలి..:దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్నా.. ఇందులో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సీఎస్‌ఐఆర్‌లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. సైన్స్‌కు ఎల్లలు లేవని, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం దీనికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.   
 

డీఎన్‌ఏను వేరు చేయడం ద్వారా రికార్డు
గిన్నిస్‌లో స్థానం సాధించిన లక్నో విద్యార్థులు
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో శనివారం సరికొత్త గిన్నిస్‌ రికార్డు నమోదైంది. జీవమున్న ప్రతి ప్రాణిలో ఉండే డీఎన్‌ఏను 550 మంది విద్యార్థులు ఏకకాలంలో వేరు చేయడం ద్వారా ఈ రికార్డు ఏర్పడింది. గతేడాది అమెరికాలోని సియాటిల్‌ చిల్డ్రన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 302 మంది విద్యార్థులు ఓ పండు నుంచి డీఎన్‌ఏను వేరు చేయడం ద్వారా గిన్నిస్‌ రికార్డ్‌ నమోదు చేయగా.. ఈసారి 500కు పైగా ఈ ప్రయత్నం చేసి విజయం సాధించారు. లక్నో శివార్లలోని జి.డి.గోయాంక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు చెందిన రిషినాథ్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రయోగం మొదలు కాగా.. ఫలితం వెల్లడయ్యేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 550 మంది విద్యార్థులను 13 గుంపులుగా విభజించి ఈ ప్రయోగం నిర్వహించారు. ముందుగా అందించిన కిట్లు, అరటిపండు ముక్కలతో విద్యార్థులు ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశారు. గిన్నిస్‌ రికార్డుల ప్రతినిధుల నిశిత పరిశీలన తర్వాత కొత్త గిన్నిస్‌ రికార్డు స్థాపితమైనట్లు రిషినాథ్‌ ప్రకటించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం, విజ్ఞాన భారతిల పేరుతో ఈ రికార్డు నమోదైంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా