ఉమకే మొగ్గు

2 Jul, 2014 03:39 IST|Sakshi
ఉమకే మొగ్గు

కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తుల ఉమ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తుల ఉమ అభ్యర్థిత్వంపై విముఖతతో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ నిర్ణయం తెలిసినా మరో పేరును తెరపైకి తీసుకురావడంపై సదరు ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్యనేతలు అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘మీకు కూడా బీ-పారాలు ఇచ్చింది పార్టీయే... గుర్తుంచుకోండి’ అంటూ మందలించినట్లు సమాచారం.
 
 టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న తుల ఉమ రాష్ట్రస్థాయి నాయకురాలిగా అనతి కాలంలోనే గుర్తింపు పొందారు. కేసీఆర్‌కు సన్నిహిత నాయకుల్లో ఆమె ఒకరుగా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పార్టీలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ స్థాయి పదవిని ఉమకు ఇవ్వాలనే దిశగా కేసీఆర్ యోచిస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ కోరుట్ల ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. అదే సమయంలో జిల్లా పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కేసీఆర్ ఆమెను జెడ్పీవైపు మళ్లించారు. జెడ్పీ చైర్‌పర్సన్ సీటు ఖాయమన్న అధినేత హామీ మేరకు ఆమె కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఎన్నికల సమయంలో స్థానికంగా కొన్ని సమస్యలు తలెత్తగా పార్టీ ఉమకు అండగా నిలిచింది. జెడ్పీటీసీగా ఆమె విజయం సాధించడంతో చైర్‌పర్సన్ ఖాయమైంది. చైర్‌పర్సన్ రేసులో ఉన్న జెడ్పీటీసీలు కూడా ఉమ గెలుపొందడంతో తమ ప్రయత్నాలు విరమించుకున్నారు.
 
 అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తమ విముఖతను వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ.. ఉమ అభ్యర్థిత్వం పట్ల కేసీఆర్ పూర్తి సానుకూలంగా ఉండటంతో ఆమె ఎన్నిక తప్పనిసరైంది. ఇప్పటికే ఉమ పేరిట బీ-ఫారాన్ని కూడా జిల్లా ముఖ్య నాయకులకు అందచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి  ఒకరిద్దరు సుముఖంగా లేకున్నా, జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఈ నెల 5న జరిగే ఎన్నికలో తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం లాంఛనమే కానుంది.
 

మరిన్ని వార్తలు