ముఖ్యమంత్రి సారూ.. స్పందించరూ..

8 Jun, 2020 08:45 IST|Sakshi
ఆకలి దీక్షలో పాల్గొన్న పట్టాభిరెడ్డి

ఆకలి దీక్షకు దిగిన ప్రైవేట్‌ అధ్యాపక, ఉపాధ్యాయ, ఉద్యోగులు

లక్డీకాపూల్‌: తమను ఆదుకోవాలని కోరుతూ ప్రైవేట్‌ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆకలి దీక్ష తలపెట్టారు. ప్రైవేటు యాజమాన్యాలు జీతాలు చెల్లించలేకపోతున్న కరోనా కష్ట కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం డిమాండ్‌ చేస్తున్నది. ఫోరం పిలుపు మేరకు ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లోనే ఆదివారం ఆకలి దీక్షలో పాల్గొన్నట్టు తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ప్రధాన కార్యదర్శి పి.పట్టాభిరెడ్డి తెలిపారు.

మూడు మాసాలుగా లెక్చరర్లకు జీతాలు లేవు, వచ్చే ఆగస్టు వరకు కూడా జీతాలు చెల్లించడం కుదరదని యాజమాన్యాలు తెగేసి చెపుతున్నాయని ఆవేదన చెందారు. తమ శ్రమ, నిబద్ధతతో వందల, వేల కోట్లు కూడబెట్టుకున్న ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు తమ ధీనావస్థను గుర్తించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ దయనీయ స్థితిని పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఆకలి దీక్షను తలపెట్టామన్నారు. ఇకనైనా తమ ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు