జేబులో డబ్బులున్నా తిండికి తిప్పలు

26 Apr, 2020 01:37 IST|Sakshi

అమెరికాలో తెలుగు విద్యార్థుల నరకయాతన

బ్యాచిలర్‌ డిగ్రీ కోసం షికాగో వెళ్లిన పలువురు భారతీయులు

ఈ నెలాఖరుతో ముగియాల్సిన సెమిస్టర్‌ పరీక్షలు

షట్‌డౌన్‌ కారణంగా వాయిదా.. బయటకు రాలేని స్థితి

ఇరుకు గదిలో ఉండలేక.. ఇంటికి రాలేక అవస్థలు

సాక్షి, హైదరాబాద్‌ : జేబులో డబ్బులున్నా తినడానికి తిండి లేదు... పక్కింటి వాళ్లను అడుగుదామంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదు... దాదాపు 45 రోజులుగా 10/10 అడుగుల వైశాల్యంలో ఉన్న గదే జీవితం. సెల్‌ఫోనే ప్రపంచం. అమ్మానాన్నలతో వీడియో కాలింగ్, ఆత్మీయులతో మాట్లాడుతూ పూట గడుపుతున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రం షికాగో పట్టణానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల దీనగాథ ఇది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిన విద్యార్థులు కరోనా కారణంగా సంకటంలో పడ్డారు. కరోనా కారణంగా కాలేజీలు మూతపడటం, హాస్టళ్లకు తాళాలు వేయడంతో వారు వీధిన పడి నిస్సహాయులుగా మారారు. వాస్తవానికి ఈనెలాఖరులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిన విద్యార్థులు అద్దెకు తీసుకున్న ఇరుకు గదుల్లో బందీలయ్యారు.

అమెరికాలో కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న నగరాల్లో నాలుగోది షికాగో. దీంతో అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్‌ విధించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్‌ మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు పరిమిత సమయంలో తెరుస్తున్నా.. అత్యవసర విధుల్లో ఉన్న వారికి మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. ఇతర ప్రజలను బయటకు రానీయడం లేదు. పొరపాటున వస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సరుకులు కొనుగోలు చేసినా అవి నిర్ణీత సమయంలో కొనుగోలుదారును చేరడం లేదు. ప్రాధాన్యత క్రమంలో వాటిని డెలివరీ చేయడంతో 2,3 రోజుల సమయం పడుతోంది. ఈ సమయంలో మిగులు తిండితో సర్దుకోవాలి.. లేకుంటే పస్తులే.
చదవండి: సెప్టెంబర్‌లో కొత్త విద్యా సంవత్సరం 

సోషల్‌ మీడియాలో ఓదార్పులు...
భారత్‌లోనూ షట్‌డౌన్‌ విధించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఇబ్బందులను చూస్తూ ఉండటం తప్ప ఎలాంటి సహకారం అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ ద్వారా పిల్లలకు నగదును బదిలీ చేస్తున్నా వాటితో వసతులు సమకూరడం లేదు. చికాగోలోని ఓ ప్రాంతంలో దాదాపు వెయ్యి మంది భారతీయ విద్యార్థులున్నారు. అందులో దాదాపు 270 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. వీరంతా వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్‌గా ఏర్పాటయ్యారు. అక్కడి పరిస్థితులను తెలుసుకుంటూ సామాజిక మాధ్యమాల్లోనే ఓదార్చుకుంటున్నారు. చికాగోలోని ఇండియన్‌ ఎంబసీ, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మంత్రులు, అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ట్విట్టర్, వాట్సాప్‌ ద్వారా వినతులు ఇస్తున్నా లాక్‌డౌన్‌ కారణంగా ఎలాంటి సహకారం అందడం లేదు.

రెండ్రోజుల పాటు నీళ్లు తాగి బతికా...
చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో బ్యాచ్‌లర్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. నెలన్నరగా ఇక్కడి రెస్టారెంట్లు, మాల్స్, ఫుడ్‌ బజార్లు మూతబడ్డాయి. బయటి నుంచి భోజనం తెచ్చుకోలేని పరిస్థితి. ప్రస్తుతం నగరమంతా షట్‌డౌన్‌లో ఉంది. ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు ఆర్డర్‌ ఇస్తే అవి రూమ్‌ వద్దకు రావాలంటే రెండుమూడు రోజులు పడుతోంది. షట్‌డౌన్‌కు ముందు కాలేజీ హాస్టల్‌లో తినేవాడిని. ప్రస్తుతం హాస్టల్‌ మూతబడటంతో తిండి దొరకడం లేదు. రూమ్‌ దాటి బయటకు వెళ్లలేకపోతున్నా. నేనుండే రూమ్‌ చిన్నది(10/10) కావడం, ఒక్కడినే ఉండాల్సి రావడం చాలా కష్టంగా ఉంది. గత వారంలో వరుసగా రెండ్రోజుల పాటు నీళ్లు తాగి బతికా. ప్రభుత్వం అనుమతిస్తే అమ్మానాన్న దగ్గరికి వచ్చేయాలనుంది.  -కుమార విష్ణు రమేశ్, థర్డ్‌ ఇయర్, బ్యాచ్‌లర్‌ డిగ్రీ, యూఐసీ

ఇబ్బందుల్ని చూసినా ఏం చేయలేకపోతున్నం
కరోనాతో అక్కడ పరిస్థితులు మారిపోయాయి. పిల్లల ఇబ్బందుల్ని చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నం. లాక్‌డౌన్‌ ప్రకటించే ముందే కాస్త వెసులుబాటు కల్పిస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లం. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తేస్తుందో... అంతర్జాతీయ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. విద్యార్థులను వెనక్కు పంపేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దాదాపు వెయ్యి మంది పిల్లల తల్లిదండ్రులం సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తున్నం, సమాచారం తెలుసుకుంటున్నా ఎలాంటి సహకారం అందించలేకపోవడం బాధ కలిగిస్తోంది.   -డాక్టర్‌ సంగీత, విద్యార్థి తల్లి, బంజారాహిల్స్, హైదరాబాద్

మరిన్ని వార్తలు