సర్కార్‌పై పోరాడే దమ్ము జేఏసీకుంది: కోదండరాం

4 Mar, 2017 03:21 IST|Sakshi
సర్కార్‌పై పోరాడే దమ్ము జేఏసీకుంది: కోదండరాం

సాక్షి, సంగారెడ్డి: ప్రజా సమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడే దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం టీజేఏసీకి మెండుగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తనపై జేఏసీ నేతలు పిట్టల రవీందర్, మరికొందరు చేసిన విమర్శలపై స్టీరింగ్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీజేఏసీ, ఎంపీజే సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి ఇస్లామిక్‌ స్టడీ సెంటర్‌లో ‘సుధీర్‌ కమిటీ’సిఫార్సులపై జరిగిన సదస్సులో కోదండరాం ప్రసంగించారు.

సుధీర్‌ కమిటీ నివేదిక ముస్లింల స్థితిగతులకు అద్దం పట్టిందన్నారు. వారికి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలన్న సిఫార్సుల అమలుకు ప్రయత్నిస్తామన్నారు. ఉర్దూను రెండో భాషగా అమలు చేయడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్షను తొలగించేందుకు ‘సమాన అవకాశాల కమిటీ’వేయాలన్నారు.

మరిన్ని వార్తలు