బల్క్ ఎస్‌ఎంఎస్‌లు నిషేధం : ఎస్పీ

11 Sep, 2014 23:59 IST|Sakshi

సంగారెడ్డి క్రైం : ఉపఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ వారైనా తమకు ఓటు వేయాలని బల్క్ మెసేజ్‌లు చేయడం నిషేధమని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారికి అనుకూలంగా మెసేజ్‌లు పంపినట్లయితే దాన్ని తన సెల్ (94406 27000)కు పంపాలని సూచించారు. మెసేజ్‌లు పంపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అలాగే మెదక్ ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా 87 ప్రొహిబిషన్ కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. 743.815 లీటర్ల అక్రమ మద్యం, రూ. 75,24,280 నగదు, రూ. 22,200 విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా 49 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. గత సాధారణ ఎన్నికలు జరిగిన సమయంలో బైండోవర్ చేసిన 7535 మంది బైండోవర్ కాల పరిమితి ఇప్పటివరకు  అమలులో ఉందదని ఆమె గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

 రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు శనివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లాకు చేరుకున్న సెంట్రల్ పారా మిలిటరీ బలగాలు, అందుబాటులో ఉన్న  పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలను వారం రోజుల క్రితమే రంగంలోకి దింపారు. జిల్లాలో 30 పోలీసు యాక్టు, సెక్షన్ 144 అమలులో ఉం ది. జిల్లాలోని సమస్యాత్మక, అతి సున్నితమైన ప్రాంతా ల్లో పోలీసుల నిఘా పెంచారు. మెదక్ పార్లమెంట్ పరిధి లో ఈనెల 13న ఉపఎన్నిక జరుగనుంది.

మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 1101 పోలింగ్ ప్రాంతాలు, 1817 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. వీటిని 177 మొబైల్ పెట్రోలింగ్ పార్టీల ద్వారా పర్యవేక్షించనున్నారు. 160 అతిసమస్యాత్మక ప్రాంతాలుగా, 339 సమస్యాత్మకమైనవిగా, 542 సాధారణమైనవిగా గుర్తించారు. ఎన్నికలు జరిగే ప్రాంతానికి సంబంధించి ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన హెడ్‌క్వార్టర్ లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు