ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

24 Apr, 2019 01:59 IST|Sakshi

26 మంది ఐఏఎస్‌లకు, 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు

సీఈసీ అనుమతితో ఆదేశాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్‌లతో మొత్తంగా 49 మందికి ప్రమోషన్లు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శైలేంద్రకుమార్‌ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్‌ల పదోన్నతులపై 10 జీవోలు, ఐపీఎస్‌ల పదోన్నతులపై 5 జీవోలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) అను మతి తీసుకొని ఈ పదోన్నతులు ఇచ్చింది. పదోన్నతులు పొందిన 26 మంది ఐఏఎస్‌ల్లో 1988 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అధికారులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా (స్పెషల్‌ సీఎస్‌) పదోన్నతులు కల్పించింది.

అదే బ్యాచ్‌కు చెందిన, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురు అధికారులకూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో అపెక్స్‌ స్కేల్‌ను ప్రకటించింది. అలాగే ఒకరికి ముఖ్యకార్యదర్శి, నలుగురికి కార్యదర్శి, ఆరుగురికి అదనపు కార్యదర్శి హోదా కల్పించింది. మరో ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శి, నలుగురికి డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రాష్ట్రంలోని 23 మంది ఐపీఎస్‌లకు కూడా పదోన్నతులు కల్పించింది. అందులో ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా, నలుగురికి ఐజీలుగా, ఏడుగురికి డీఐజీలుగా, ఆరుగురికి సీనియర్‌ ఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చింది. ఇందులో కేంద్ర సర్వీసుల్లో ఉన్న వీపీ ఆప్టేకు ఐజీగా పదోన్నతి ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వారంతా యథాస్థానాల్లో కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు