సివిల్‌ వర్సెస్‌ ఆర్మ్‌డ్‌

12 Mar, 2018 00:56 IST|Sakshi

     కానిస్టేబుళ్లలో పదోన్నతుల లొల్లి

      అడ్డుపడుతున్నారని ఏఆర్‌పై సివిల్‌ 

     సీనియారిటీ ఉందని సివిల్‌పై ఏఆర్‌ 

     ఆరోపణలు, కోర్టు కేసులతో పోలీస్‌ శాఖ సతమతం 

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖకు సివిల్‌ విభాగం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లే బలం, బలగం. అలాంటి వారి మధ్య కొద్ది రోజులుగా కోల్డ్‌వార్‌ నడుస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆర్మ్‌డ్‌ (ఏఆర్‌) విభాగం నుంచి సివిల్‌లోకి కన్‌వర్షన్‌ అయిన కానిస్టేబుళ్ల వల్ల పదోన్నతులు రావడం లేదంటూ హైదరాబాద్‌ కమిషనరేట్‌ సివిల్‌ కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిల్‌ విభాగంలో 25 ఏళ్లుగా కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నా పదోన్నతులు లభించడంలేదని, కానీ ఏఆర్‌ నుంచి వచ్చి ఏడేళ్ల సర్వీసు పూర్తిచేసుకోకుండా పదోన్నతులు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సీనియారిటీ ప్రకారం పదోన్నతులివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఏఆర్‌ నుంచి కన్‌వర్షన్‌ ద్వారా వచ్చిన కానిస్టేబుళ్లూ ఆరోపిస్తున్నారు. సివిల్‌ కానిస్టేబుళ్ల పదోన్నతి విషయమై కొద్దిరోజుల క్రితం పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టగా పదోన్నతులు నిలిపేయాలని ఏఆర్‌ కానిస్టేబుళ్లు కోర్టుకెళ్లి ఆదేశాలు తీసుకొచ్చారు. దీంతో పదోన్నతులు అడ్డుకుంటున్నారంటూ సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారు. 

అక్కడలా.. ఇక్కడిలా.. 
సాధారణంగా బెటాలిన్‌ స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు ఏఆర్‌ విభాగానికి కన్‌వర్షన్‌ అయితే 7 ఏళ్ల సర్వీసు నిండిన తర్వాతే పదోన్నతికి అర్హులవుతారు. అయితే ఏఆర్‌ నుంచి సివిల్‌కు వచ్చే కానిస్టేబుళ్లు ఇందుకు ఒప్పుకోవడం లేదని సిటీ పోలీస్‌ సివిల్‌ కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. అక్కడ వర్తించిన నిబంధనలు ఇక్కడ ఎందుకు వద్దని వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పాత సర్వీసు ప్రకారమే పదోన్నతి కల్పించాలంటూ ఏఆర్‌ కానిస్టేబుళ్లు ప్రత్యారోపణలు చేస్తున్నారు.  

అధికారుల్లో వణుకు 
ఓవైపు ఏఆర్‌ నుంచి కన్‌వర్షన్‌ అయిన కానిస్టేబుళ్ల పదోన్నతులపై కోర్టు స్టే విధించింది. మరోవైపు 25 ఏళ్లుగా పదోన్నతి లేకుండా ఉన్న 1990, 91, 92 ,93 ,95, 96 బ్యాచ్‌లకు చెందిన హైదరాబాద్‌ కమిషనరేట్‌ సివిల్‌ కానిస్టేబుళ్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కోర్టు ఆదేశాలు.. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకొని పదోన్నతులు ఎలా కల్పించాలని డీజీపీ కార్యాలయం సందిగ్ధంలో పడింది. ప్రత్యేక అధికారాలు ఉపయోగించడమా? లేక మరిన్ని పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపడమా? తేల్చుకోలేకపోతోంది. ఏ క్షణంలో సిటీ పోలీస్‌ విభాగంలో సామూహిక సెలవు పరిస్థితి ఏర్పడుతుందోనని ఉన్నతాధికారులు వణికిపోతున్నారు.   

మరిన్ని వార్తలు